కడెం, నవంబర్ 26 : ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రజలు ఆదరించాలని, నా తుది శ్వాస వరకు ఖానాపూర్కే నా జీవితం అంకితం చేస్తానని భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో గడిచిన పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
తండాలను, గూడేలను పంచాయతీలుగా తీర్చిదిద్ది స్వయం పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, గిరిజన, ఆదివాసీ గూడేల అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, అలాగే ఇటీవల ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్లను ఇచ్చి సహకరించిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఖానాపూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు, ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. కవ్వాల్ టైగర్‌జోన్ వల్ల ఇక్కడి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ఆ ఆంక్షలను ఎత్తివేయాలని, రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని కోరారు. అలాగే కడెం ప్రాజెక్టు రీడిజైన్ చేసి, శాశ్వత పరిష్కారం చూపించాలని, వానకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని కోరారు. అలాగే కడెం మండలంలోని గంగాపూర్ వంతెనతో పాటు రోడ్డు నిర్మాణం, సిరిచెల్మ రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.