ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 28 : కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రూ.5250 కోట్లతో ఆదిలాబాద్‌లో అభివృద్ధి జరిగిందన్నారు.
గత పాలకులు ఇంత అభివృద్ధి చేయలేదన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్ రావాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని అన్నారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఆదిలాబాద్, బోథ్ నియోజవర్గాల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని, మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలన్నారు.
జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు. 15 వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. మావల నలంద కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నుంచి బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే బైక్ నడిపారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలోని ప్రధానవీధుల గుండా ర్యాలీ కొనసాగింది.
– స్వామిగౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. నేడు ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందంటే అది మంత్రి హరీశ్‌రావు చలవేనన్నారు. నాడు రాష్ట్రం ఎంత దగాకు గురైందని ప్రత్యేక రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జోగు రామన్నను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి జరిగిందని మరింత ప్రగతి కోసం కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎంపీ నగేష్ కోరారు. ఆదిలాబాద్ సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ రైతాంగానికి, అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా హామీలను నెరవేరుస్తారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.