ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా ప్రజాసేవలో ఉన్నానని, ప్రజల మనిషిగానే గుర్తింపు పొందానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు.
తన హయాంలోనే వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, ఇతర రంగాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే నాలుగు సార్లు గెలిచానని, మరోసారి తనను అక్కున చేర్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులెత్తిస్తున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈమేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
– ఆదిలాబాద్, నవంబరు 11 ( నమస్తే తెలంగాణ)
నమస్తే : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది?
జోగు రామన్న: ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు వెనుకబడిన జిల్లాగా పేరుంది. ఆంధ్రా పాలకులు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని విస్మరించడంతో నియోజకవర్గ ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీ పడుతున్నది. నియోజకవర్గంలో పదేండ్లలో రూ. 5 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు.
జోగు రామన్న : ఆదిలాబాద్ నియోజకవర్గం వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, ఇతర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. ఆదిలాబాద్ నుంచి బేల మండలం ఉపసనాలకు పోవాలంటే రెండున్నర గంటల సమయం పట్టేది. వానకాలంలో వాగులు పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. పదేండ్లలో నియోజకవర్గంలో రూ. 1000 కోట్లతో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాం. జిల్లా కేంద్రం నుంచి ప్రజలు 45 నిమిషాల్లో తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. రాత్రి, పగలు లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన పెన్‌గంగ ప్రాజెక్టు పేరిట ప్రతిపక్షాలు 40 ఏండ్లు మోసం చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చనాక, కొరాట ప్రాజెక్టును నిర్మించి ఇక్కడి ప్రజల కలలను సాకారం చేశారు. రూ.1165 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టుతో 52 వేల ఎకరాలకు సాగునీరు అందబోతున్నది. ట్రయల్ రన్ పూర్తికాగా ఎన్నికల తర్వాత నీటి విడుదల జరుగుతున్నది.
జోగు రామన్న : గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ రంగాలు నిరాదరణకు గురయ్యాయి. దీంతో పేద విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోయారు. ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నది. రెసిడెన్షియల్ స్కూళ్లలో పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులు అందుతున్నాయి. ఈ స్కూళ్ల అప్‌గ్రేడేషన్ వల్ల డిగ్రీ వరకు చదువుకునే అవకాశం లభిస్తుంది. జిల్లాలో రిమ్స్ మెడికల్ కళాశాలలో యూజీ, పీజీ వైద్యవిద్య అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం ఆదిలాబాద్‌కు వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసింది.
ఫలితంగా జిల్లా విద్యార్థులు స్థానికంగా ఉంటూ ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం లభించింది. ఆదిలాబాద్‌లో ఐటీ రంగం విస్తరణ జరుగుతున్నది. ప్రభుత్వం రూ. 40 కోట్లతో ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది. ఇప్పటికే రెండు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా 250 మంది మంచి వేతనాలతో పని చేస్తున్నారు. గతంలో జిల్లాలో వైద్యసేవలు అందక ఏజెన్సీలో మరణాలు సంభవించేవి. ఇప్పుడు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుతున్నాయి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఖరీదైన వైద్యం పేదలకు ఉచితంగా లభిస్తుంది. మహారాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌కు వస్తున్నారు. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ రక్షితమైన నల్లా నీరు అందుతున్నది.
నమస్తే : ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంది.
జోగు రామన్న: సీసీఐ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. మూతపడిన సీసీఐని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నాతో పాటు ఇతర నాయకులు కోరినా బీజేపీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా పరిశ్రమకు రాయితీలు కల్పిస్తామన్నారు. సీసీఐని రాష్ర్టానికి అప్పగించాలని లేదా 51: 49 నిష్పత్తిలో ప్రారంభిస్తామని సూచించారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి సీసీఐని ప్రారంభిస్తామన్నారు. మాజీ కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం సీసీఐని సందర్శించి పరిశ్రమను తెరిపిస్తామన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు పరిశ్రమను అమ్మడానికి చర్యలు చేపట్టారు. సీసీఐ స్క్రాప్‌ను వేలం వేస్తున్నారు. 6 వేల మందికి ఉపాధి కల్పించే సీసీఐ విషయంలో కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతారు.
జోగు రామన్న: సీఎం కేసీఆర్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నాటినుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా. 40 ఏండ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నా. ప్రజల మనిషిగా నాకు గుర్తింపు ఉంది. పదేండ్ల పాటు చేసిన అభివృద్ధి, పథకాల అమలు ఫలితంగా ప్రజల నుంచి మంది ఆదరణ లభిస్తుంది. మహిళలు మంగళహారతులు, స్థానికులు పూలదండలు, డప్పు చప్పుళ్లు, పటాకులు పేలుస్తూ, నృత్యాలు చేస్తూ స్వాగతం పలుకుతున్నారు. స్వచ్ఛందంగా ప్రచారానికి తరలివస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ఐదో సారి నన్ను ఆశీర్వదంచడానికి సిద్ధంగా ఉన్నారు.
జోగు రామన్న: ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. యువత పెద్ద సంఖ్యలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ. 5 కోట్లకు ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నాడని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. నా బలం.. బలగం నియోజకవర్గ ప్రజలే.