ఎదులాపురం, నవంబర్ 24 : దేశంలోని వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న అక్కడి ప్రజలకు ఫించన్ రూ.2016, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు? తెలంగాణలో సీఎం కేసీఆర్ పది సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారని ఎన్నిక సమయంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో వస్తా ఎదో చేస్తామని జూటా ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడ, శాంతినగర్, రవీంద్రనగర్, బొక్కలగూడ, కోలిపూర కాలనీల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు.
ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలకారు. దారి పొడవునా పూల వర్షాలు కురిపించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మీ దగ్గరికి వచ్చిన సమయంలో ఇతర రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న అక్కడ ఆసరాపింఛన్ రూ.2016 ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని పార్టీల నాయకులు కాపి కొడుతున్నారని గుర్తు చేశారు.
ఆదిలాబాద్‌ను రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 30 జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, వార్డు కౌన్సిలర్లు రాజు, రామెల్లి శ్రీలత, నాయకులు రాము, చిన్నపటేల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 24 : ఆదిలాబాద్‌లోని గుల్జార్, మదీనా మసీద్‌లో శుక్రవారం ప్రార్థనలు చేసుకొని బయటకు వస్తున్న ముస్లిం సోదరులను ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కలిశారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకుంటూ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఆయన వెంట మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.