ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ప్రతి రూపాయీ తిరిగి ప్రజల బాగోగులకే వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ(ఆర్)లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామాల్లో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్‌తో జిల్లాకు ఒరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాగా, సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలిరాగా, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఆదివాసీలు కార్యక్రమాన్ని హోరెత్తించారు.
జైనథ్, ఏప్రిల్ 28: ప్రజా సంక్షేమానికే రాష్ట్ర సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మండలం మేడిగూడ(ఆర్)లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. 68 ఏండ్లుగా జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే చేసి చూపించామని గుర్తుచేశారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని చెప్పారు. రాష్ట్రంలో 2.5 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తించిందని తెలిపారు. పోడు భూముల ఫైల్‌పై మే1 న సీఎం కేసీఆర్ సంతకం చేయనున్నారని వెల్లడించారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో బీజేపీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ ఇస్తామన్న కేంద్రం గ్యాస్ ధరలను రూ. 400 నుంచి రూ.1200 వరకు పెంచిందన్నారు.
జనధన్ పేరిట మహిళల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. , రైతుల సబ్సిడీలు కూడా ఎత్తివేస్తూ కేంద్రం అన్యాయం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌కు అప్పగిస్తూ ప్రజల సొమ్మును పెట్టుబడిదారులు, దేశ ద్రోహులకు దోచి పెడుతున్నదని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు రూ.19 లక్షల కోట్లు మాఫీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న బీజేపీ సర్కారు, రామమందిరాల నిర్మాణానికి ప్రజల నుంచి చందాలు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో యాదాద్రి నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. రూ.50 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 19.35 లక్షల ప్ర భుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను కల్పించిందని, ఈమేరకు శ్వేతపత్రం కూడా విడుదల చేశామన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఏ గ్రామంలో కూడా తిరగడం లేదని, ఆయన కేవలం ఆదిలాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనతో జిల్లాకు ఒరిగిందేమి లేదన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేను ఆదివాసీలు సంప్రదాయ డోలు వాయిద్యాల ప్రతిధ్వనుల నడుమ ,నృత్యాల నడుమ స్వాగతించారు. ఇక్కడ ఎంపీపీ గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి , రైతుబంధు డైరెక్టర్ చంద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, ఐటీడీఏ డైరెక్టర్లు దేవన్న, తానాజీ, సర్పంచ్ సీమ శ్యాం, ఎంపీటీసీలు భరత్, పీఏసీఎస్ చైర్మన్ పోతన్న, నాయకులు తూడం రాములు, పొచ్చన్న, పెందూర్ మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.