చెన్నూర్, నవంబర్ 9 : చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో తనను మరోసారి ఆశీర్వదిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయంలో తన సతీమణి అలేఖ్యతో కలిసి నామనేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి సిడం దత్తుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ తరుపున మాజీ మంత్రి బోడ జనార్దన్ రెండో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు.
అనంతరం మీడియా పాయింట్ వద్ద, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. మందమర్రిలో ఈ నెల 7న నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆశ్వీదించారని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు గుండా రాజకీయాలకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్.. అతడి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దేశమంతా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టిన ఆయన చెన్నూర్‌లో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పక్కనే గోదావరి, ప్రాణహిత నదులున్నా చుక్క నీరు ఎందుకు తీసుక రాలేదని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు సూట్‌కేసులతో ఇక్కడికి వచ్చి.. అడ్డగోలుగా లీడర్లను కొంటున్నారని మండిపడ్డారు.
చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వేలం పాటలు నడుస్తున్నాయని.. పెట్టుబడిదారుల వైపు ఉంటారో.. పేద బిడ్డ వైపు ఉంటారో?.. వ్యాపార వేత్తల వైపు ఉంటారో.. ఉన్నత విద్యావంతుడి వైపు ఉంటారో.. వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ల దిక్కు ఉంటారో.. వేల కోట్ల నిధులు తీసుక వచ్చి అభివృద్ధి చేసే దిక్కు ఉంటారో.. ప్రజలే ఆలోచన చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే.. రేపు రాష్ట్రాన్ని అమ్ముకుంటుందన్నారు. వాళ్ల ఇండ్ల చుట్టూ తిరిగే పరిస్థితులు రావద్దని, మన జీవితాలను ఆగం చేసుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. పచ్చబడ్డ చెన్నూర్ నియోజకవర్గంలో చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలారా ఆగం కాకండి, ఈ బిడ్డను కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని కోరారు.
నియోజకవర్గంలో గుండా, హత్యా, బెదిరింపు రాజకీయాలు పోవాలని, అభివృద్ధి రాజకీయాలు రావాలన్నారు. దేశానికి 75 ఏండ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిందని, ఈ రోజు పని చేసే నాయకుడిని, పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే పార్టీలను పట్టించుకోవాలని ఆయన కోరారు. పుట్టిన బిడ్డ.. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటదో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండాలని, అదే విధంగా చెన్నూర్ నియోజకవర్గం బాల్క సుమన్ చేతిలో ఉండాలన్నారు. వేరే వాళ్ల చేతికి పోతే సామంత రాజుల పాలన వస్తుందని, బెదిరింపు రాజకీయాలు వస్తాయని, వ్యాపారస్తులు సరిగా పని చేసుకోనటువంటి రోజుల వస్తాయని హెచ్చరించారు.
దళిత గిరిజన.. బడుగు బలహీన వర్గాల వారు పెట్టు బడుదారులు, సామాంత రాజుల ఇండ్ల చుట్టూ చేతులు కట్టుకొని.. వాళ్ల కాళ్లు మొక్కి బతికే పరిస్థితులు వస్తాయని, దయచేసి అటువంటి వివక్ష.. అసమానతలు నియోజకవర్గంలో రావద్దంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ పదేళ్లలో చేపట్టిన ప్రగతే తిరిగి తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఎక్కడా ఎలాంటి గొడవలకు తావులేకుండా.. శాంతియుతమైన వాతవరణంలో ఎన్నికలు జరగాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.