బెల్లంపల్లి, మార్చి 7 : బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన గడ్డం వినోద్ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం సమయమివ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినతులు ఇవ్వడానికి ఉదయం 11 గంటల నుంచి వేచి చూశారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు సమావేశ మందిరానికి చేరుకున్న ఆయన, హడావుడిగా వినతులు స్వీకరిస్తూ ముందుకెళ్లారు. దీంతో అక్కడున్న వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలు విన్నవిద్దామంటే నిమిషమైనా ఆగకుండా వెళ్లడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను రోజులకోసారి ఇలా వచ్చి.. అలా వెళ్తున్నారని, తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలని వేడుకుంటున్నారు.