కన్నెపల్లి, ఏప్రిల్ 10 : కార్యకర్తలే మా బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. మొదట దండె విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతుంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మాత్రం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై ఎనలేని భారం మోపుతుందని మండిపడ్డారు. నల్ల ధనం తెప్పిస్తామని, అందరి ఖాతాల్లో జమ చేస్తామని గొప్పలు చెప్పి మాట తప్పిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ్రప్రైవేట్ పరం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రా నుంచి వచ్చిన షర్మిళకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు.
ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
– ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి పనులను ఈ తొమ్మిదేళ్లలో చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సాగు నీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. కేంద్రం పేద ప్రజల నడ్డివిరుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నదని కొనియాడారు. కేంద్రం పాలిస్తున్న రాష్ర్టాల్లో మన పథకాలు అమలు చేసే ధమ్ముందా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కుట్రలు చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
– జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ సర్కారు అత్యధిక ఉద్యోగాలిచ్చిన తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లులేదని కొనియాడారు. బీజేపీ సర్కారు పాలనను పక్కనబెట్టి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంద ని, ప్రజలంతా ఒక్కటై వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేణికుంట ప్రవీణ్, జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ భువనగిరి నిరంజన్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయిని రంగారావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆకుతోట రాజన్న, ఎంపీటీసీలు నండుగూరి భారతి, లతాశ్రీ, సర్పంచ్‌లు బుచ్చక్క, తిరుపతి, లక్ష్మి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.