బెల్లంపల్లి, నవంబర్ 8 : ‘సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిదేండ్లలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లిన.., పట్టణంలో 10 వేలకు పైగా.., సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న 7 వేల మందికి, ప్రభుత్వ భూ ముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న 3 వేల మందికి పట్టాలు పంపిణీ చేసిన.., 30 పడకల దవాఖానను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసుకొని కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నాం.., ఇక్కడే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం.., పట్టణ నడిబొడ్డున రెండు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం.., మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా..’ అని బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌స్టేడియం ఆవరణలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో దుర్గం చిన్నయ్య మాట్లాడారు. 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ మంజూరు కాగా, 27 కంపెనీలకు అనుమతి వచ్చిందన్నారు. కేటీఆర్ కృషితో బెల్లంపల్లి నడిబొడ్డున రెండు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. రానున్న కాలంలో కేసీఆర్ ఆశీస్సులతో మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బెల్లంపల్లికి సంబంధం లేని వ్యక్తిని, డబ్బుల సంచులతో వస్తున్న వారిని నమ్మే పరిస్థితిలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు లేరని తెలిపారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి భంగపడి, చిత్తుగా ఓడిపోయిన ఆయన మళ్లీ ఎన్నికల సమయంలో వస్తున్నాడని ఆరోపించారు.
ఇక్కడి ప్రజలు నాలుగు సార్లు ఓడించి, హైదారాబాద్‌కు పంపించారని గుర్తు చేశారు. బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీటిని అందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను చిన్నయ్య కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల లేదని, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉన్న 12 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. గిరిజనులకు గురుకుల పాఠశాల, తాండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చామని, ఇంకొందరు ఉన్నారని, వారికి కూడా ఇవ్వాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ప్రాజెక్టులకు కాలువలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో వామపక్ష పార్టీల నుంచి సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ, వైఎస్ఆర్టీపీ నుంచి కాశీ సతీశ్, సీపీఐ నుంచి మామిడాల రాజేశంతో పాటు సీపీఎం నుంచి మరో ముగ్గురు నాయకులకు సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.