బోథ్, ఏప్రిల్ 25: రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. బోథ్ సమీపంలోని పొచ్చెర క్రాస్‌రోడ్డులో ఉన్న సాయి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, మద్ధతు ధరలతో పంటల కొనుగోళ్లు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో వెతికినా కనిపించవన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టేలా సిద్ధం కావాలని సూచించారు.
ప్రజల మద్దతు కార్యకర్తలు, నాయకుల పనితీరు చూస్తుంటే కేసీఆర్ సారథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపం, మహనీయుల చిత్రపటాలకు పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై వివిధ మండలాల నాయకులు తీర్మానాలు ప్రవేశపెట్టగా, కార్యకర్తల హర్షధ్వానాల నడుమ ఆమోదం పూర్తయ్యింది. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం కిరణ్‌కుమార్, బోథ్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఏఎంసీ చైర్మన్ రుక్మన్‌సింగ్, ఎలుక రాజు, కృష్ణారెడ్డి, రాజారాం, భాస్కర్‌రెడ్డి, సునీతారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నాగన్న, తోట వెంకటేశ్, అరుణ్, సజన్‌లాల్, నీలాబాయి, మేరాజ్ అహ్మద్, జలంధర్, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.