‘పదిహేనేండ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా. నియోజకవర్గంలోని గడప గడపకూ తిరిగా. ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగనిరీతిలో ప్రగతి సాధించాం. ఇంకా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రగతిని పరుగులు పెట్టిస్తా. సాగుకు కేసీఆర్ కావాల్సిందాని కంటే ఎక్కువగానే చేశారు, చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో ఢోకాలేదు. ఇవే మా విజయానికి పునాది రాళ్లు అవుతాయి అనడంలో సందేహం లేదు. నాపై నమ్మకం పెట్టి, బోథ్ టికెట్ ఇచ్చిన కేసీఆర్ సారుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. టికెట్ ఇచ్చి మూడు రోజులైనా కాకముందే బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇక, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్ముతున్నా.’ అని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి అనిల్ కుమార్ జాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే’ తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– బోథ్, ఆగస్టు 24
బోథ్, ఆగస్టు 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మదిలో నిలిచిపోయాయి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారు. చేసిన పనులే బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపిస్తాయని బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ఎలా అభివృద్ధి చెందాయి?
అనిల్ జాదవ్ : ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు దొరకాలంటే విద్యార్థులకు కష్టంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లేక పిల్లలు చేరేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారింది. ఆదర్శ, గురుకుల పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదు. వందల సంఖ్యలో ఉన్న సీట్ల కోసం వేలాది మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. ‘మన ఊరు-మన బడి’తో సౌకర్యాలు మెరుగయ్యాయి. గ్రామీణ స్థాయిలో వైద్య సదుపాయాలు మెరుగు పడ్డాయి. పల్లె దవాఖానలతో సేవలు అందుతున్నాయి. దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. రైతుబీమాతో కుటుంబాలకు భరోసా వచ్చింది. గతంలో ఎకరా భూమి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పెరిగింది. విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుల రుణాలను మాఫీ చేసింది.
నమస్తే : అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరు?
అనిల్ జాదవ్ : గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. పింఛన్లను రూ.2,016కు పెంచింది. వికలాంగులకు ఇటీవలే రూ. 4,016 అందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు, టేకేదారులకు పింఛన్లు అందిస్తున్నది. తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడంతో పల్లెల్లో అభివృద్ధి ముమ్మరంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం, ఇతర మౌలిక వసతుల కల్పన, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీరు అందుతున్నది. మిషన్ కాకతీయతో చెరువులు బాగై సాగు నీటి వసతి పెరిగింది.
నమస్తే : ప్రతిపక్ష పార్టీల పరిస్థితి?
అనిల్ జాదవ్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. గతంలో కంటే భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. 15 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో గెలుపు ఖాయం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తన అభ్యర్థిత్వం ప్రకటించి మూడే రోజులైనా బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు వచ్చి కలిసిపోతున్నారు. ఫోన్లో తమ మద్దతు మీకే అంటూ ప్రకటిస్తున్నారు.