ఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు నిచ్చారు. మంగళవారం బోథ్‌లో నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సభ విజయవంతంలో గ్రామ, మండల స్థాయి నాయకులు బాధ్యత తీసుకుకోవాలని, ఛలో వరంగల్ వాల్ పేయింట్స్ రాయాలని కోరారు. సభకు బయలుదేరే రోజున ఉదయం నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగురవేసి డప్పులతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. వారం రోజుల్లో గ్రామాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగం విని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం 15 నెలలపాలనలో ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టిందన్నారు. రైతు భరోసా లేక రూ.2 లక్షల రుణమాఫీ కాక రైతులు ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మీ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట మార్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన డబ్బులు వస్తున్నాయన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మండలాల కన్వీనర్లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.