కెరమెరి, జూన్ 23: మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులపై కెరమెరి మండల గిరిజనులు కన్నెర్రజేశారు. తాగునీటి ఎద్దడి తీర్చాలంటూ సోమవారం కెరమెరి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై జోడేఘాట్, పాట్నాపూర్, బాబేఝరి, శివాగూడ, పాటగూడ, పిట్టగూడ, కొలాంగూడ గ్రామాలకు చెందిన సుమారు వంద మంది గిరిజనులు బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ల సరఫరా లేక ఎంతో గోస పడుతున్నామని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు ఇచ్చిన వినతిపత్రాలు, పత్రికల్లో వచ్చిన కథనాల ప్రతులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. జిల్లా అధికారులు స్పష్టమైన హామీనిచ్చే వరకు ఇక్కడి నుంచి కదలబోమని ఖాళీ బిందెలతో భీష్మించుక్కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో రహదారి కిక్కిరిసిపోయింది.
దీంతో పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు పట్టువిడవలేదు. అనంతరం ఎస్ఐ మధుకర్ అంబులెన్స్‌ను ఆపకుండా వెళ్లనివ్వాలని కోరడంతో దారినిచ్చారు. అంబులెన్స్‌కు బదులు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ వాహనమని గ్రహించిన గిరిజనులు అడ్డుపడి విన్నవించేందుకు ప్రయత్నించారు. కాని అదనపు కలెక్టర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. మరింత ఆగ్రహంతో ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ స్పందించి అధికారులతో మాట్లాడిస్తానని చెప్పగా.. ‘సారూ నీ కాళ్మొక్తాం మాకు నీళ్లందేలా చూడాలె’ అంటూ ఇద్దరు గిరిజనులు ఎస్ఐ కాళ్లపైపడి ప్రాధేయపడ్డారు. సమస్య తీవ్రతను గమనించిన ఎస్ఐ అధికారులతో న్యాయం జరిగిలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ ధర్నాతో ఎంతో మంది ప్రయాణికులు రోడ్డుపై ఇబ్బందులు పడుతున్నారని శాంతించాలని కోరారు. వెంటనే అక్కడి నుంచి రాస్తారోకో విరమించి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత నీటి సరఫరా శాఖ ఏఈ విశ్వేశ్వర్ అక్కడికి చేరుకొని రేపటి నుంచి నీళ్లు సరఫరా కాకుంటే ట్యాంకర్లతోనైనా అందించేలా చూస్తానని స్పష్టమైన హామీనివ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఈ నిరసనలో బాబేఝరి రాయిసెంటర్ సార్మేడి మూట ఎల్లయ్య, మాజీ సర్పంచ్ మానిక్‌రావు, గిరిజన నాయకులు సుబాష్, గోపాల్, శ్రీనివాస్, కోండు, గుండా, రాజు, తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.