కన్నెపల్లి, మార్చి 28 : భీమిని మండలం మామిడిపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. పనులన్నీ వదులుకొని బావులు, వాగుల వెంట పరుగులు తీయాల్సి వస్తున్నది. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ ఉండగా, కొన్నిచోట్లకు మాత్రమే కొంత నీరు సరఫరా అవుతున్నది. అలాగే రెండు బావులుండగా, ఒక్కోదాంట్లో 20 నుంచి 30 మోటర్లు బిగించారు. ప్రస్తుతం ఎండల తీవ్రతకు నీళ్లు అడుగంటి పోగా, ఉన్న కొద్దిపాటి నీటిని తోడుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచే బారులు తీరుతున్నారు.
మొదట వచ్చిన వారికే నీరు దొరుకుతుండగా, మిగతా వారంతా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. ఇక కొందరు పక్క ఊరి సమీపంలోని వాగులోకి వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకొని గొంతు తడుపుకుంటున్నారు. వ్యవసాయం, ఉపాధి పనులన్నీ వదులుకొని తాగు నీటికోసం తల్లడిల్లుతున్నామని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
తాగు నీటి కోసం తిప్పలు పడుతున్నం. ఎండలకు బావిలో కూడా నీళ్లు లేకుంటైయినయి. తెల్లారి 4 గంటలకు లేచి మొదట బోరు వేసినోళ్లకే నీళ్లు దొరుకుతున్నయి. మిగిలిన వారు వాగులు వంకల పొంట తిరుగుతున్నరు. మా గోస పట్టించుకున్నోళ్లు లేరు. ఇప్పటికైనా తాగునీటి సమస్య తీర్చాలి.
– ఆదే రేణుక
ఎండలకు వాగులో కూడా నీళ్లు లేవు. చెలిమెల్లో నీటి ఊట రావడం లేదు. బిందె నిండడానికి మస్తు టైం పడుతున్నం. తాగునీటి కోసం బాధపడుతున్నాం. పనులన్నీ వదులుకొని నీళ్లకోసం తిరుగుతున్నం. సార్లు స్పందించి మా గోస తీర్చాలి.
– కొట్రంగి సుజాత
మంచి నీళ్ల కోసం మస్తు బాధ పడుతున్నం. మా గోస పట్టించుకున్నోళ్లు లేరు. ఓట్ల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పి ఇప్పుడు మా ఊరి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇకనైనా మా బాధలు తీర్చుతరో లేదో.. మరి
– ఆదే భారతి