ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వయాన మంత్రి ఆదేశాలు బుట్టదాఖలవు తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఈ నెల 20న జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao ) పరిశీలించారు.
ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామానికి సమీపంలో ఉన్న లో లెవల్ వంతెన ( కల్వర్టు) ను పరిశీలించారు. కల్వర్టు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన మంత్రి జూపల్లి స్పందించారు . వంతెనుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం కోసం హై లెవల్ వంతెనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు.
మంత్రి పర్యటన ముగిసి మూడు రోజులు గడిచిన అధికారులు కల్వర్టుకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. మంత్రి పర్యటన సందర్భంగా హడావుడి చేసిన అధికారులు తీరుపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.