హైడ్రా పేరిట బుల్డోజర్లతో సామాన్యుల బతుకులను ఆగం చేస్తున్న సర్కారు, అధికార పార్టీ నేతల అక్రమాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆదివార్పేట్ గ్రామ శివారులోని అనుములకుంట చెరువును ఆక్రమించినట్లు స్వయంగా అధికారులే గుర్తించగా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇక ఆ భూమిపై రీసర్వే చేయించాలంటూ సదరు నేత కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోగా, నెలలు గడుస్తున్నా యంత్రాంగం ఆ వైపు దృష్టి సారించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. చెన్నూర్ నియోజకవర్గంలో అక్రమాలకు.. అవినీతికి తావు లేదంటూ చెప్పుకొచ్చిన మంత్రి, మరి ఈ అంశంపై నోరుమెదపకపోవడం వెనుక మతలబేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
మంచిర్యాల, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘చెన్నూర్ నియోజకవర్గంలో ఎక్కడా అక్రమాలకు, అవినీతికి తావు లేదు. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడమే నా లక్ష్యం. నాపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చారు. సర్కారుకు ఆదాయం సమకూర్చేందుకు కృషి చేస్తా. అక్రమాలు చేసింది ఎవ్వరైనా సరే ఉపేక్షించేది లేదు’. ఇలా ఎప్పుడు నియోజకవర్గంలో పర్యటించినా రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ చెప్పే మాటలివే.. కానీ, ఇవి చెప్పడమే తప్ప చేతల్లో చేసిందేమీ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. మం త్రి వివేక్ పరోక్షంగా అండగా నిలుస్తారనే విమర్శలున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్లో నిర్మాణాలున్నాయంటూ హైడ్రా పేరిట రాత్రికి రాత్రే బుల్డోజర్లను పంపి పేదల ఇళ్లు, గుడిసెలను తొలగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మాత్రం పార్టీ లీడర్లకు మినహాయింపులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, చెన్నూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కుటుంబ సభ్యుల పేరుపై ఆదివార్పేట్ గ్రామ శివారులో సర్వే నంబర్ 25లో అనుములకుంట చెరువును ఆనుకొని వ్యవసాయ భూమిని కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఆపై అనుముల కుంట ఆనకట్టను తొలగించి చెరువు శిఖంలో భూములను ఆక్రమించారు. దీనిపై కొన్ని రోజులుగా చెన్నూర్‌లో చర్చలు నడుస్తున్నాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు, పలు వార్తా పత్రికల్లో కథనాలు సైతం వచ్చాయి. దీనిపై స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గతేడాది నవంబర్ 6న జాయింట్ సర్వే నిర్వహించారు.
రెవెన్యూ రికార్డులను అనుసరించి అనుములకుంట 10.01 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఆ మేరకు మండల సర్వేయర్ ఆధ్వర్యంలో హద్దులను ఇరిగేషన్ శాఖ అధికారులకు చూపించారు. ఈ క్రమంలో అనుములకుంట కబ్జాకు గురైనట్లు అధికారులు స్పష్టం చేశారు. చెరువు మొత్తం విస్తీర్ణం 10.01 ఎకరాల్లో.. 2.35 ఎకరాల్లో సదరు కాంగ్రెస్ లీడర్ ఆయిల్‌పామ్ తోట సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మరో 0.0950 గుంటల అనుముల కుంట భూమిలో జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన కొంత భాగం ఉందని, అలాగే మరో 0.0150గుంటలను ఆక్రమించి తాత్కాలిక షెడ్లు నిర్మించారని నిగ్గుతేల్చారు. ఈ మేరకు చెన్నూర్ మండల సర్వేయర్ అనుముల కుంట చెరువు మ్యాప్‌ను రూపొందించి, తదుపరి చర్యల కోసం చెన్నూర్ ఇరిగేషన్‌శాఖ డీఈకి రెఫర్ చేశారు.
మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడిగా పేరున్న నాయకుడు ఆదివార్పేట్లోని అనుములకుంట చెరువు శిఖం భూములను కబ్జా చేశారని జాయింట్ సర్వేలోనే తేలింది. దీనిపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ దీనిపై సదరు నేత కోర్టుకు వెళ్లారు. మరోసారి సర్వే చేయించుకునేందుకు ఆర్డర్లు తెచ్చుకున్నారు. దీంతో అధికారులు ఆపేశారు. జాయింట్ సర్వే పూర్తయి, ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి దాకా సర్వే లేదు. అటువైపు కన్నెత్తి చూసింది లేదు. అదే కోర్టు.. సామాన్యుల ఇండ్లను కూల్చొద్దని ఆదేశాలిచ్చినా సర్కారు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది. సామాన్యులకో న్యాయం, అధికార పార్టీ నాయకులకో న్యాయామా.. అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. 8 నెలల క్రితం జాయింట్ సర్వే జరిగింది. దానిపై కోర్టుకు వెళ్తే రీ సర్వే కోసం ఆదేశాలు వచ్చాయి. దీనికి ఇన్ని నెలల సమయం ఎందుకు పడుతుంది. ఇంకెప్పుడు సర్వే చేస్తారు. అధికారులు కావాలనే ఉద్దేశపూర్వంగా సర్వేను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సామాన్యుల విషయంలో వేగంగా జరుగుతున్న పనులు, అధికార పార్టీ లీడర్లకు వచ్చే సరికి ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ చెన్నూర్‌లోని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి అనుచరుడైతే శిఖం భూములను ఆక్రమించవచ్చా.. రీ సర్వే చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారంటూ మండిపడుతున్నారు. ఎప్పుడో తాతల కాలంలో చెన్నూర్‌లో పట్టణంలో గాలికుంట పక్కన కట్టుకున్న ఇండ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ నోటీసులిచ్చి సర్వే చేసిన అధికారులు.. అదే కాంగ్రెస్ లీడర్కైతే నెలల కొద్దీ సర్వేను ఆపేస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. మంత్రి చెప్పే మాటలు నిజమైతే కబ్జాకు గురైన అనుములకుంట చెరువు శిఖం భూములపై తక్షణమే సర్వే చేయించి, ఆ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుములకుంట చెరువు శిఖం భూములను కబ్జా చేసింది మంత్రి ప్రధాన అనుచరుడు కావడంతోనే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సాధారణ జనాల ఇండ్లను కూల్చేందుకు రాత్రికిరాత్రే వస్తున్న బుల్డోజర్లు.. చెరువు శిఖంను కబ్జా చేశారని తెలిసినా చర్యలు తీసుకోవడంలో, రీ సర్వే చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మేరకు మంత్రి వివేక్ నుంచి అధికారులకు ఏమైనా ఒత్తిడిలు వస్తున్నాయా అన్నది తేలాల్సి ఉంది. అక్రమాలు చేసిన వారు ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని మంత్రి పలుమార్లు చెప్పారు.
శనిగకుంట మత్తడి పేల్చివేత సమయంలోనూ చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కేసులో అసలు దొంగలను వదిలి.. కొసరును పట్టుకున్నారనే విమర్శలున్నాయి. అక్కడ కూడా సూత్ర దారి ఈ కాంగ్రెస్ లీడరే అన్న ఆరోపణలున్నాయి. ఇతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సర్కారు, ఎంతటివారైనా వదిలేది లేదనే మంత్రి సారు.. ఈ నాయకుడి విషయంలో ఎందుకు ఏం చేయలేకపోతున్నారన్నది అర్థం కాకుండా పోయింది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చెన్నూర్‌లో కీలక నాయకుడిగా ఉన్న ఓ లీడర్ ఇప్పటికే అలక బూనారు. బహిరంగంగానే మంత్రిపై విమర్శలు సైతం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లీడర్పైన చర్యలు తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుందని మంత్రి వివేక్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తున్నది. అలాంటిది ఏం లేకపోతే కబ్జాకు గురైన అనుములకుంట శిఖం భూముల్లో రీ సర్వే చేయించి, వెంటనే అక్రమాలను తొలగించాలని డిమాండ్ స్థానికంగా వినిపిస్తున్నది.
ఈ విషయమై చెన్నూర్ ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్‌ను వివరణ కోరగా.. జాయింట్ సర్వేలో చెరువు శిఖం భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. కానీ, పట్టాదారు కోర్టుకు వెళ్లడంతో రీ సర్వే చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు మండల పంచాయతీ అధికారి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీకి లెటర్ రాశారన్నారు. వారు వచ్చి సర్వే చేయాల్సి ఉందన్నారు. రీ సర్వేలో ఆక్రమణలు తేలితే వెంటనే చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.