ఉట్నూర్/ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 12 : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజనుల, ప్రజల కష్టాలు బాగా తెలుసు అని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.. మెస్రం వంశీయులు మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను సత్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలు బాగా తెలుసు కనుకనే ఈ జిల్లాకు ఇన్చార్జిగా సీఎం రేవంత్‌రెడ్డి నియమించారన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నారన్నారు. జిల్లాలో కల్మషం లేని గిరిజన జాతులు, సహజ వనరులు, పర్యటక కేంద్రాలు చాలా ఉన్నాయని తెలిపారు. అందుకే పర్యటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ దర్బార్ ఏర్పాటుకు కారణాలు తెలుపుతూ శిలాఫలకం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగోబా జాతర సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రంలో దర్బార్‌కు వచ్చిన ఆదివాసులు వ్యక్తి రుణాలతోపాటు వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తులను అధికారులు శాఖలవారీగా తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు.