ఎదులాపురం/ నిర్మల్ టౌన్, మే 16: ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు నకిలీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీసీలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్,అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆధారంగా ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అయితే ఎరువులు, విత్తనాల కొరత సృష్టించకుండా జిల్లాలో టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలోలైసెన్సు పొందిన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టి రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకున్నామని, ఇందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. డీలర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధనలు తెలియజేశామమని, అక్రమ విత్తనాలు, ఎరువులు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో..
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ. జ్లిలాలో నకిలీ విత్తనాలు అరికట్టడానికి వ్యవసాయ , పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, జి ల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, ఇతర అధికా రులు పాల్గొన్నారు.