ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా (Nagoba Jatara ) దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు మేస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ఆమె నాగోబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని మంత్రి ప్రార్థించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి, ఆదివాసీల సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన కేస్లాపూర్ నాగోబా క్షేత్రం విశిష్టత అపూర్వమని పేర్కొన్నారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు. మేస్రం వంశీయుల పెద్దలు మంత్రిని శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అడ్మిన్ ఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ పటేల్, సర్పంచ్ మేస్రం తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ మేస్రం ఆనంద్ రావ్, బాధిరావ్ పటేల్, కటోడ కోసేరావ్, హనుమంత్ రావ్, దాదారావ్, మనోహర్ పాల్గొన్నారు.