ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉండగా, పాలన అస్తవ్యస్తంగా మారింది. మాస్టర్ ప్లాన్‌కు మోక్షం లేకపోగా, వసతులు కరువై భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇరువై నెలలుగా కన్నెత్తి చూడని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొదటిసారి నేడు బాసరకు వస్తుండగా, ఇప్పటికైనా ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించాలని భక్తులు విన్నవిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మంజూరైన భవనాలను ఆమె ప్రారంభించడమే కాదు, సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
బాసర, జూలై 11 : బాసర సరస్వతీ క్షేత్రం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నా, అందుకు తగ్గ సౌకర్యాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తున్నది. అయితే కాంగ్రెస్ పాలనలో కనీస పట్టింపు కరువైంది. అయితే బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. నాడు రూ.50 కోట్ల నిధులను విడుదల చేసింది. అందులో నుంచి రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాలు, భక్తులు సేద తీరేందుకు వీలుగా షెడ్లను నిర్మించారు.
అనంతరం మాస్టర్‌ప్లాన్ కోసం అప్పటి ప్రభుత్వం స్థపతి, అర్కిటెక్చర్‌తో పాటు శృంగేరి పీఠాధిపతి అనుమతుల అనంతరం అప్పటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పనులకు భూమి పూజ చేశారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనుల ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మిగిలిన రూ. 42కోట్లను వెనక్కి తీసుకెళ్లింది. అప్పటి నుంచి బాసరకు ఎలాంటి నిధులను విడుదల చేయలేదు. ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదు.
బాసర ఆలయంలో ఇన్చార్జి ఈవో పాలన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఇప్పటి వరకు ముగ్గురు ఈవోలు మారారు. ప్రస్తుతం బాసర నుంచి దాదాపు 200కిలోమీటర్ల దూరంలో ఉన్న కీసర గుట్ట ఈవోను బాసర ఇన్చార్జి ఈవోగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దీంతో ఈవో బాసరలో పూర్తిగా సేవలందించలేక పోతున్నాడు. అంతేగాకుండా పలు కీలకమైన పోస్టులు ఇంజినీరింగ్ విభాగం, సూపరింటెండెంట్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఉత్సవాలు, సెలవుల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కాని ఆ సమయంలో అధికారులు చేతులెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఆలయంలో సిబ్బంది కొరతనే ప్రధాన కారణం.
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13కోట్లతో టీటీడీ వంద గదుల అతిథి గృహం, రెనోవేషన్తో పాటు ఆలయ కార్యనిర్వాహణ(ఈవో) కార్యాలయం నిర్మించేందుకు టెండర్లను పిలిచి పనులను ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం ఆగిపోయింది. తర్వాత భవనాలు పూర్తి అయ్యాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బాసరకు రూపాయి కూడా మంజూరు చే యలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ ఏడాదిన్నర గడిచినా కనీసం కన్నెత్తి చూడలేదు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన వసంత పంచమి ఉత్సవాలతోపాటు నవరాత్రి ఉత్సవాలకు కూడా ఆమె రాలేదు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించాల్సి ఉన్నా, హాజరు కాలేదు. కానీ, నేడు ఆ భవనాలను ప్రారంభించడానికి వస్తుం డడంపై బీఆర్ఎస్ నాయకులు, భక్తులు, స్థానికులు విమ ర్శిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వస్తే సమస్యలు తెలుసుకోవడానికి వీలుండేదని చెబుతు న్నారు. ఇప్పటికైనా వస్తున్నందుకు సంతోషమని చెప్పారు. ఆలయంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, మాస్టర్‌ప్లాన్ అమలు చేసి బాసరపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
బాసర ఆలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టీపట్టనట్టుగా ఉన్నది. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రి పలు ఉత్సవాలకు పట్టు వస్ర్తాలను సమర్పించడానికి రాలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన పనులు పూర్తయిన తర్వాత భవనాల ప్రారంభోత్సవానికి మాత్రం రావడం ఏంటి? బీఆర్ఎస్ మంజూరు 42 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుపోయిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేసి అభివృద్ధి పనులకు రావాల్సిన మంత్రులు ఇప్పుడు రావడం శోచనీయం.
– కిరణ్ కొమ్రేవార్, బీఆర్ఎస్ ముథోల్ నియోజక వర్గ సమన్వయ కర్త