నిర్మల్ అర్బన్, జూన్ 25 : అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దుర్గామాత బోనాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఆదివారం నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఆలయంలో అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని గుర్తు చేశారు.జిల్లాలో దాదాపు వెయ్యి ఆలయాలను అభివృద్ధి చేవామని, ఈ ఆలయానికి రూ 15 లక్షల నిధులు ఇచ్చామని చెప్పారు. అడెల్లి ఆలయాన్ని రూ.15 కోట్లతో నిర్మిస్తున్నామని, నంది గుండం ఆలయానికి రూ.5 కోట్లు మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, తారక వాణి రఘు, ఆలయ కమిటి సభ్యులు తదితరులున్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని గాజుల్‌పేట్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణం నడిబొడ్డున రూ. 50 లక్షలతో శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది తామేనని గుర్తు చేశారు. బీజేపీ శివాజీ మహారాజ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. విగ్రహావిష్కరణకు విచ్చేసిన మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నాయకులు పాకాల రాంచందర్, గొనుగోపుల నర్సయ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.