‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మందమర్రి పట్టణంలో రూ.175.35 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మే ఒకటిన ముస్లిం, క్రిస్టియన్ల గ్రేవ్యార్డ్స్ పనులు ప్రారంభిస్తామని, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయిస్తామని తెలిపారు. సారంగపల్లిలో రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణితో మా ప్రభుత్వానికి విడదీయరాని పేగుబంధం ఉందని, 15 వేల మందికి వారసత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మందమర్రి, ఏప్రిల్ 28 : “సింగరేణి వెలుగు జిలుగుల అద్భుతమైన పట్టణం మందమర్రి. కోల్‌బెల్ట్ ఏరియాలో గోలేటి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఉన్న ఎన్నో పట్టణాల్లో అన్నింటికంటే ముందు ఏర్పడ్డది . గొప్పగా అభివృద్ధి సాధించి, అద్భుతమైన ప్రగతితో ముందుకు సాగాల్సిన పట్టణం. కానీ కాంగ్రెస్ పార్టీ దరిద్రపు ఆలోచనలు, బీజేపీ, తెలుగుదేశం తెలివితక్కువ, దౌర్భాగ్యపు విధానాలతో అభివృద్ధికి నోచుకోలేక వెనుకబడిపోయింది” అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో 2014 నుంచి మందమర్రి పట్టణం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు.
ఒక్క మందమర్రి పట్టణంలో రూ.175.35 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందుకు గర్వంగా ఉందని చెప్పారు. కళ్లుండీ చూడలేనటువంటి, చెవులుండీ వినలేనటువంటి దరిద్రులకు ఇవి కనిపించకపోవచ్చన్నారు. కానీ మందమర్రి గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకూ ఇక్కడ జరుగుతున్న ప్రగతి కండ్లముందు కనిపిస్తుందని తెలిపారు. మందమర్రిలో బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగిందన్నారు. ఈ గడ్డపై పార్టీకి ఎదురేలేదని, మరోసారి బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అర్బన్ పథకం ద్వారా రూ.78 కోట్లతో పట్టణంలోని 13,780 ఇండ్లకు మంచినీళ్ల బాధ తప్పించామన్నారు. ఈ విషయం మందమర్రిలో ఏ ఆడబిడ్డను అడిగినా చెబుతారని చెప్పారు. మంచిర్యాల-చంద్రాపూర్ నేషనల్ హైవే విస్తరణలో 300 ఇండ్లు పోతున్నాయని స్థానికులు వచ్చి చెప్పగానే కొట్లాడి మరి రూ.41 కోట్లతో మందమర్రి పట్టణంలో ైప్ల్రెఓవర్ నిర్మిస్తున్నామన్నారు.
అదనపు భారమైన భరించి ఈ హైవేపై ఎక్కడా లేనివిధంగా భారీ ైప్లెఓవర్ను ఇక్కడ కట్టుకుంటున్నామని చెప్పుకొచ్చారు. 10 ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ పార్క్, పాలవాగుపై రూ.8.20 కోట్లతో బ్రిడ్జి నిర్మించబోతున్నామన్నారు. అన్నింటికంటే ము ఖ్యంగా మే 1న ముస్లిం, క్రిస్టియన్ల గ్రేవ్యార్డ్స్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 560 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించుకుంటామన్నారు. ఇండ్లకోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా లంచం అడిగితే వాళ్లు బీఆర్ఎస్ పార్టీ వాైళ్లెనా, ఎవరైనా సరే వదిలిపెట్టబోమని బాల్క సుమన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
సింగరేణితో మాది పేగుబంధం
తెలంగాణ కొంగుబంగారం సింగరేణితో కేసీఆర్ ప్రభుత్వానికి విడదీయరాని పేగుబంధం ఉందన్నారు. గత ప్రభుత్వాలు వారసత్వ ఉద్యోగాలను తీసేస్తే, తెలంగాణ వచ్చాక 15 వేల మంది పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సంస్థ లాభాల్లో 30శాతం వాటా ఇచ్చిన ఏకైక సంస్థ సింగరేణి కొనియాడారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యం, మహిళా ఉద్యోగులకు 26 వారాలా మెటర్నిటీ లీవ్, అన్ని మతాల పండుగలకు సెలవులు, కార్మికుల పిల్లలకు ఐఐటీ, ఐఐఎంతో సీట్లు వస్తే ఫీజు రీయింబర్స్మెంట్, కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నపేదలకు పట్టాలు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంప్‌లు, క్వార్టర్లకు ఉచితంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్యూటీలో చనిపోయిన కార్మికుడికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, విరమణ వయసు 61కి పెంపు, దసరా, దీపావళి పండుగలకు అడ్వాన్స్ చెల్లింపులు ఇవన్నీ కేసీఆర్ వచ్చాకే జరుగుతున్నాయన్నారు.
వారసత్వ ఉద్యోగాల్లో ఎవరికైనా కొడుకు లేకపోతే అల్లుడు, బిడ్డకు కూడా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పిన మనసున్న నాయకుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కుక్కను చంపేముందు పిచ్చికుక్క అని ముద్ర వేస్తారని, అలాగే సింగరేణి నష్టాల్లో ఉందని ప్రచారం చేసి అదానీకి అప్పజేప్పేందుకు బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ సింగరేణిని వేలం వేయమని చెప్పారని, ఆపై మాట మార్చారని గుర్తు చేశారు. 51శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. మరి 51శాతం వాటా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరించొద్దని లేఖ రాసినా, పరిశ్రమల మంత్రి కేటీఆర్ లేఖ రాసినా, మా సింగరేణి సీఎండీ ఢిల్లీ దాకా వచ్చి అడిగినా గనులు సింగరేణికి ఇవ్వకుండా, వేలం ఎందుకు వేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే గుజరాత్ ప్రభుత్వం లిగ్నైట్ గనులు కావాలని అడగ్గానే ఇచ్చిన మోదీ సింగరేణికి ఎందుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ సింగరేణి కార్మికులు గమనించాలన్నారు. ప్రైవేటీకరణ కుట్ర చేసే బీజేపీ వాడు మన బొగ్గు బావుల మీద ఎలా తిరుగుతాడో, ఎలా మీటింగ్‌లు పెడుతాడో చూడాలన్నారు. సింగరేణి గడ్డ మీద పుట్టినోడు ఎవడూ బీజేపీ పార్టీలో ఉండొద్దన్నారు. బీజేపీ నాయకుల మాయ మాటలు, మతోన్మాదంలో పడి కరిగిపోతే అంతిమంగా నష్టపోయేది సింగరేణి కార్మికులేనని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన బీఆర్ఎస్ కచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా సింగరేణిని ఎవరూ ప్రైవేటీకరించలేరన్నారు.
మందమర్రి పట్టణాన్ని 1/70 నుంచి మినహాయించాలి
మందమర్రి పట్టణానికి 1/70 చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని సుమన్ కోరారు. కేసీఆర్ శిష్యుడిగా తాను వందశాతం నిజమే మాట్లాడుతానన్నారు. మందమర్రి పట్టణాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ1/70లో పెట్టిందని, దీంతో మందమర్రి పట్టణంలో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. అందుకే పట్టణాన్ని ఈ చట్టం నుంచి తప్పించాలన్న నా మాటను పట్టుకొని దుష్ప్రచారం చేశారన్నారు. అసలు ఈ చట్టంలో చేరాల్సిన అవసరమే మందమర్రి పట్టణానికి లేదన్నారు. భూరియా కమిటీ సిఫార్సు ప్రకారం ఉన్న జనాభాలో 50 శాతం గిరిజన, ఆదివాసీ లేదా కొండ ప్రాంతాల వాసులు, అటవీ ప్రాంతాల వాసులు, గుత్తి కోయలు, కొండ రెడ్లు, ఆర్థికంగా విపరీతమైన వెనుకబడిన వర్గాలు ఉంటేనే 1/70 తేవాలన్నారు. కానీ ఆనాడు లక్షెట్టిపేట, మందమర్రి కాంగ్రెస్ దొరలకు జరిగిన గొడవలో అనవసరంగా మందమర్రి 1/70లోకి వెళ్లిపోయిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మందమర్రిలో ఓసీ, బీసీ, మైనార్టీలు 67శాతం మంది ఉన్నారన్నారు. అలాంటి పట్టణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిన తప్పులతో వెనుకబడి పోతుందన్నారు. ఊరు మందమర్రిని 1/70లో చేర్చడానికి బదులు మొత్తం మందమర్రి పట్టణాన్ని చేర్చి అన్యాయం చేశారన్నారు. మందమర్రి మున్సిపాలిటీకి పాలకవర్గం రావాలన్నా, ఎన్నికలు కావాలన్నా ఈ యాక్ట్ నుంచి మినహాయింపు తప్పనిసరి అన్నారు. ఈ పట్టణానికి ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, దాన్ని కొనసాగిస్తున్న బీజేపీ నాయకులు ఈ గడ్డపై ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. చెన్నూర్కంటే ముందే పట్టణంగా ఉన్న మందమర్రి వెనుకబడి పోవడానికి కారణమైన ఆ పార్టీలను తరిమికొట్టాలన్నారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బొగ్గుగని కార్మికులకు సూచించారు.
రూ. 500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
మందమర్రి పక్కన సారంగపల్లిలో రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని విప్ సుమన్ పేర్కొన్నారు. ఆ ఫ్యాక్టరీతో మన ఏరియాలోని 500 మందికి ప్రత్యక్షంగా, మరో 3000 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ సంస్థ పెరుగుతున్న కొద్ది భవిష్యత్తులో ఈ మందమర్రి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దానిపై ఆధారపడే మరో నాలుగైదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విషయంలో కన్ను కుట్టిన కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కొందరు రైతులతో కలిసి ఫ్యాక్టరీ పెట్టే స్థలం మాదని కోర్టులో కేసు వేయించారని మండిపడ్డారు. ఆ స్థలం ఎప్పుడో ప్రభుత్వం తీసుకొని.. వాళ్లకు డబ్బులు ఇచ్చింది. అది గవర్నమెంట్ జాగా. కానీ ఇక్కడ పరిశ్రమ వస్తే కేసీఆర్‌కు, బాల్క సుమన్‌కు పేరు వస్తది అని చిల్లర ఆలోచనతో కోర్టులో కేసు వేయించారు. కానీ మనం మొండోళ్లం.. కోర్టు కేసు కొట్టేపించినం, ఆ భూమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. మే మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మే చివరి లేక జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్ వచ్చే అవకాశముందని, వీరిలో ఎవ్వరో ఒకరి చేతుల మీదుగా ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇచ్చేందుకు ఇండ్ల స్థలాలు గుర్తించామన్నారు. ఎవరూ అనవసరంగా కంగారు పడొద్దని, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క దగ్గర మినహా ఎక్కడా ఇవ్వలేదన్నారు. ఇస్తామన్న దగ్గర కూడా కోర్టు కేసుతో ఆగిపోయిందని, మన దగ్గర ఇండ్ల స్థలాలు ఇవ్వడం మొదలుపెడితే మళ్లీ ఆగిపోవద్దని, పకడ్బందీగా పూర్తి చేసుకుందామని చెప్పారు.
వారంలో మరో రూ.20 కోట్లు
ఏ పార్టీ ఆధ్వర్యంలో మందమర్రి డెవలప్ అయ్యింది, ఏ పార్టీ హ యాంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందనేది జనాలకు వివరించాలన్నారు. మందమర్రి పట్టణంలో రూ.172 కోట్లతో చేసిన అభివృద్ధి పనులతో తాను సంతృప్తి చెందలేదన్నారు. అందుకే వారంలో మరో రూ.20 కోట్లు తీసుకువస్తానన్నారు. ఆ నిధులతో పట్టణంలో 24 వార్డుల్లో 100 రోజుల ప్రణాళిక పెట్టుకొని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ‘ఈ అభివృద్ధి యజ్ఞం కొనసాగాలే. బ్రహ్మాండంగా ఈ పట్టణం ముందుకు సాగాలే. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలే’ అని అన్నారు. ఈ క్రమంలో వేరే పార్టీలు చేసే కుట్రలను, దుష్ప్రచారాన్ని మన నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. ఎప్పుడూ నేను మందమర్రికి వచ్చినా కొత్త ఉత్సాహంతో పోతా. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిర స్సు వంచి, మీ సోదరుడిగా, మీ ఇంటి బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా హృద య పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో మరింత బ్రహ్మాండంగా పనులు చేసుకుందన్నారు. రాబోయే ఎన్నికలు ఏవైనా అందరం కలిసి పని చేసుకుందామన్నారు. ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ మందమర్రి నుంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం కూడా మందమర్రి పట్టణం నుంచే మొదలుపెడుతానన్నారు. మీ దీవెనలతో కేసీఆర్, కేటీఆర్ సహకారంతో మరింత అద్భుతంగా పని చేస్తానని స్పష్టం చేశారు.
జిల్లాలో అందరికంటే ఎక్కువ నిధులు సుమన్‌కే : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజక వర్గాలుంటే.. అన్నింటికంటే ఎక్కువ నిధులు బాల్క సుమన్ నియోజకవర్గమైన చెన్నూర్‌కే సీఎం కేసీఆర్ ఇచ్చారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంత్రిగా ఉన్నా.. తనకంటే ఎక్కువ నిధులు సుమన్ తెచ్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం అలాంటిదని చెప్పారు. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సుమన్ ఒక్క మాట అడగ్గానే సీఎం కేసీఆర్ రూ.1600 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ పేగుబంధమైన సింగరేణిని నష్టాల పేరుతో ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఆ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణిని కాపాడుకోవడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ 100 సీట్లు గెలవడం ఖాయమని చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ రెండో స్థానం, బీజేపీ మూడోస్థానంలో నిలుస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ…పెన్నుల మీద దుమ్ము కప్పితే గన్నులమై మొలకెత్తుతామని తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన నానుడిని అనుసరించి గన్నులా ఎదిగిన డైనమిక్ లీడర్ బాల్క సుమన్ అన్నారు. ఆయన హయాంలో చెన్నూర్ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. అభివృద్ధికి అడ్డం తగులుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. తన అన్న కొడుకు బాల్క సుమన్‌ను గెలిపించుకొని మందమర్రి ముద్దుబిడ్డగా నిలబెడుతామని చెప్పారు. చెన్నూర్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న సుమన్‌ను ఎప్పటికీ మరచిపోమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, పట్టణ వీధులన్నీ గులాబీమయమయ్యాయి. జై బాల్క సుమన్.. జైజై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఒగ్గు డోలు కళాకారులు నృత్యాలతో హోరెత్తించారు. బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి నిర్మల తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.