‘పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పక్కాగా విజయఢంకా మోగిస్తాం. ఇవాళ ఎవరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆరే, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్సే. చెన్నూర్‌లో తమ్ముడు బాల్క సుమన్, మంచిర్యాలలో దివాకరన్న గెలుపు తథ్యం. అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకోవాలి..’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీశ్‌రావు ఉద్ఘాటించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం హాజీపూర్ మండలంలోని రూ.85 కోట్ల పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు, రూ.3 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు భూమిపూజ చేశారు. చెన్నూర్ పట్టణంలోని 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. సుమారు రూ.55 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో, బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలంగాణను 2004-2014 దాకా కాంగ్రెస్ పాలించిందని, అభివృద్ధి చేసింది శూన్యమని, మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే అథోగతి కావాల్సి వసుందని పేర్కొన్నారు.
మంచిర్యాల, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో పది గెలుస్తామని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పెద్దగా లేదన్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇవాళ ఎవ్వరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆర్ అని, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలోని రూ.85 కోట్ల పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు, రూ.3 కోట్లతో విద్యత్ సబ్‌స్టేషన్ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. సుమారు రూ.55 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. 1985లో ఎన్టీఆర్ మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్‌రెడ్డి మంచిర్యాల జిల్లా చేస్తామని చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. కానీ.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మంచిర్యాల జిల్లా చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసి మీకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు రూ.500 కోట్లతో మంచిర్యాలకు మెడికల్ కాలేజీ వచ్చిందని, నర్సింగ్ కాలేజీ వచ్చిందని, 600 పడకల పెద్ద ఆసుపత్రి కూడా కడుతున్నామని, చెన్నూర్ రెవెన్యూ డివిజన్ అయ్యిందని, కొత్తగా రెండు మండలాలు ఏర్పాటు చేసుకున్నామని, మందమర్రిలో రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ రాబోతుందని, చెన్నూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఇలా గడిచిన పదేండ్లలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తెలంగాణను జాతీయ ముఖచిత్రంలో సీఎం కేసీఆర్ నిలబెట్టారన్నారు. దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూస్తున్నదని, తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అన్నంత గొప్పగా కేసీఆర్ పాలన అందించారన్నారు. దీన్ని మనం ఇలాగే ముందుకు తీసుకుపోయేందుకు మన కేసీఆర్‌ను, దివాకరన్ననను, తమ్ముడు బాల్క సుమన్‌ను గెలిపించుకొని ఇటు మంచిర్యాల, చెన్నూర్‌ను అభివృద్ధి చేసుకుంటూ అటు తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
హాజీపూర్ మండలంలోని చిట్టచివరి గ్రామాలకు కడెం నీళ్లు రాక రెండో పంటకు ఇబ్బంది పడుతున్నారని, నీళ్లు లేక పొట్టకు వచ్చిన సమయంలో పంటలు ఎండిపోతాయని పట్టుబట్టి మీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పడ్తనపల్లి ఎత్తిపోతల పథకాన్ని మీ కోసం మంజూరు చేపించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రూ.85 కోట్లతో చేపట్టిన ఈ పథకం హాజీపూర్‌లోని 16 గ్రామాలు, లక్షెట్టిపేటలోని మరో 2 గ్రామాలకు సాగు నీరు అందిస్తుందన్నారు. పడ్తనపల్లి లిఫ్ట్ పూర్తి చేసుకొని హాజీపూర్‌లో నీళ్ల బాధ లేకుండా, ఈ మండలం మొత్తం రెండు పంటలు పండేలా అభివృద్ధి చేసుకోబోతున్నామన్నారు. ఈ రోజు తెలంగాణ రాకపోతే, కేసీఆర్ లేకపోతే ఈ పనులన్నీ జరిగేవా ఆలోచించాలన్నారు. ఇవాళ పడ్తనపల్లి లిఫ్ట్ ఇంత తొందరగా మంజూరైందంటే అది దివాకర్‌రావు కారణంగానే మంజూరైందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించడానికి 33/11 కేవీ దొనబండ సబ్స్టేషన్కూ శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లా అయ్యిందంటే కేసీఆర్, దివాకర్‌రావు కారణంగానే అయ్యిందన్నారు.
తెలంగాణలో 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విషయం అందరికీ తెలుసు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గోదావరి ఒడ్డునే ఉన్నా వేసవి కాలంలో తాగునీటి కోసం మా అక్కాచెల్లెళ్లు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందన్నారు. ఈ రోజు కేసీఆర్ వచ్చాక ఏ అక్కగానీ, చెల్లె గానీ బిందెపట్టుకొని రోడ్డు మీదకు రాకుండా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష సాయం అందిస్తున్నదన్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పదేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా, అక్కడ ఆడపిల్లల పెండ్లిళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో 12.70 లక్షల మంది ఆడపిల్లల పెండ్లిళ్లకు రూ.11 వేల కోట్లు ఈ ప్రభుత్వం సాయం అందించిందన్నారు. మహిళల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలు తెచ్చామన్నారు. ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గతంలో మీ పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడేవాళ్లన్నారు. కానీ.. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి మీ పిల్లల కాన్పు కోసం పోతే కేసీఆర్ కిట్టు ఇచ్చి తల్లిబిడ్డలను తెచ్చి ఆటోచార్జీలు లేకుండా మీ ఊరిలో, మీ ఇంటి దగ్గర దించిపోతున్నారన్నారు. ఈ రకంగా ఆసుపత్రులు బలోపేతమయ్యాయన్నారు. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. తాగు, సాగునీరు, విద్యుత్, వైద్య రంగాల్లో మనం స్వయం సమృద్ధిని సాధించామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర రంగాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతామని చెప్పారు.
నేను ఎవరినో కాదు మీ హాజీపూర్ అల్లుడినే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మా దివాకర్ అన్న వచ్చి మెడికల్ కాలేజీ అంటే దాన్ని తెచ్చి హాజీపూర్‌లో మీ మండలంలో పెట్టామన్నారు. హాజీపూర్ మీద నాకు కూడా కొద్దిగ, జరంతనన్న ప్రేమ ఉంటుందన్నారు. మీరు అడిగితే మెడికల్ కాలేజీ పెట్టిన మంచిర్యాల జిల్లా కాలేజీనే మీ మండలానికి తెచ్చానన్నారు. ఇంకా కూడా తప్పకుండా నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కేసీఆర్ ఆశీస్సులతో హాజీపూర్‌కు, మంచిర్యాలకు మరిన్ని నిధులు తెస్తానన్నారు. దివాకర్‌రావు మంచి మనిషి అని, ఏమున్నా కడుపులోటి, బయట ఒకటి ఉండదన్నారు. ఉన్న మాట కుల్లంకుల్లా చెప్తుడే ఆయనకు తెలుసునని, అది కొంత మందికి నచ్చకపోవచ్చన్నారు. కార్యకర్తలు, వేదిక మీద ఉన్న నాయకులకు ఒకటే చెప్తున్నా.. “మీ భవిష్యత్ మేం కాపాడుకుంటాం. మీ అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. మా బాల్క సుమన్, మా ఎంపీ వెంకటేశ్ నేతకాని అందరూ ఉంటారు. మేము అందరం మిమ్ములను కాపాడుకుంటాం. ఎందుకంటే కచ్చితంగా వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే. మన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంటే పనులు ఆగకుంటా జరుగుతయ్. భవిష్యత్‌లో మీకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇప్పించే బాధ్యత మేం తీసుకుంటాం. కష్టపడి పనిచేసి మంచిర్యాల అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి. తప్పిపోయి గిట్ల ఇక్కడ ఇంకొకరు వస్తే ప్రజలు, కార్యకర్తలు నష్టపోతరు. ఆ నష్టం జరగకుండా చూసుకుందామని పిలుపునిచ్చారు.
– ఎవరు అవునన్నా.. కాదన్నా.. చెన్నూర్‌లో గెలిచేది మన బాల్క సుమనే, మన బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సుమన్ మీ కోసం ఎంత కష్టపడుతారో నేను దగ్గరి నుంచి చూశానన్నారు. అన్నా మా చెన్నూర్‌లో వంద పడకల ఆసుపత్రి కావాలే. మా ప్రజలంతా మంచిర్యాలకు పోవాలంటే లేట్ అవుతుందని, చాలా మంది మధ్యలోనే చనిపోతున్నరని, మాది వెనుకపడ్డ ప్రాంతమని, మాకు మంచి దవాఖాన కావాలని నా ఎంబడి పడి 100 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చాడన్నారు. చెన్నూర్ రెవెన్యూ డివిజన్ దశాబ్దాల కలను ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు పోయిండ్రు కానీ సాకారం చేయలేదని, ఈ రోజు రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే అది సుమన్ కారణంగానే వచ్చిందన్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండకు లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన వారి ఉత్సాహాన్ని చూస్తుంటే ఇది చెన్నూర్ విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచాక ఏ ఉత్సాహంతో ర్యాలీ తీస్తామో.. ఇవాళ అలాంటి ర్యాలీ ఈ చెన్నూర్ నడిబొడ్డున కనిపిస్తుందన్నారు. గతంలో చెన్నూర్‌కు వచ్చిన మంత్రులు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నరా.. మీరే ఆలోచించాలన్నారు. సుమన్ హయాంలోనే లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే రూ.1,600 కోట్ల చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, చెన్నూర్ రెవెన్యూ డివిజన్, రెండు కొత్త మండలాలు, వంద పడకల ఆసుపత్రి, ఐదు వందల కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రూ.55 కోట్లతో చెన్నూర్ పట్టణాభివృద్ధి ఇట్లా చెప్పుకుంటుపోతే ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. ఇప్పుడు చెన్నూర్‌కు ఒక కొత్త దశ, దిశ వచ్చిందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి.. చెన్నూర్ అభివృద్ధి ఆగొద్దంటే మన విజయాల పరంపరా ఇలాగే కొనసాగించాలని, మన బాల్క సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బాల్క సుమన్ ఒక ఎదిగిన నాయకుడని, మీ అందరికీ కొండంత అండగా ఉంటారని చెప్పారు.
గోదావరి వరదలు వచ్చినప్పుడు ఒడ్డున మా పొలాలు మునుగుతున్నయ్. మా రైతులను కాపాడాలి అని బాల్క సుమన్ అడిగారని, గతంలో కూడా ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చారని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా చెప్పారు. తప్పకుండా ఒక సర్వే చేపించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత మాదన్నారు. కరకట్టలు కట్టి రైతుల భూములు పోకుండా కాపాడుకుంటామని లేదా ఆ రైతులు ఇష్టపడితే ప్రభుత్వమే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ భూమి సేకరిస్తుందన్నారు. ఏదేమైనా ఆ రైతులను కాపాడేది మాత్రం ఖాయమన్నారు. గింత చేసినోళ్లం గది చేయమా.. ఇంత పెద్ద కాళేశ్వరం కట్టినం, రెవెన్యూ డివిజన్ ఇచ్చినం, మండలాలు ఇచ్చినం, బస్సు డిపో ఇచ్చినం.. వంద పడకల ఆసుపత్రి కట్టినం, పామాయిల్ ఫ్యాక్టరీ కట్టినం, రూ.1600 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినం… అలాగే తప్పకుండా ఆ రైతులకు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. తప్పకుండా బాల్క సుమన్‌ను గెలిపించండి మీ అందరినీ కాపాడే బాధ్యత మాది అని మంత్రి స్పష్టం చేశారు. సుమన్ ఇక్కడ గెలవాలే.. అక్కడ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలి అని పిలుపునిచ్చారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, యువనాయకుడు విజిత్‌రావు, ఇతర ముఖ్యనాయకులు, అధికారులు పాల్గొన్నారు.