ఈ నెల 30న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి 15 మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని తరలిం చాలని సూచించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం మన అదృష్టమన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించి.. ఏర్పాట్లపై చర్చించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, జూన్ 26 : ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేపట్టబోయే జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి 15 మండలాల ముఖ్యకార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్‌తో పాటు పోలీస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారని, కుమ్రం భీం, మాజీ మంత్రి కోట్నాక్ భీం రావు విగ్రహాలను ఆవిష్కరిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచేకాకుండా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నియోజకవర్గానికి 5 వేల మంది చొప్పున.. లక్ష మందిని తరలించాలని కోరారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ఆసిఫాబాద్ నుంచి ప్రారంభించడం మన అదృష్టమన్నారు. జిల్లాలోని 16 వేల గిరిజన కుటుంబాలకు 36 వేల ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలు అందిస్తారని చెప్పారు.
ఏర్పాట్లు పరిశీలన
జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్ పక్కన ఖాళీ స్థలంలో జరిగే సీఎం సభ ఏర్పాట్లను జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్‌పాయి, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. సభకు తరలివచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వాహనాల పార్కింగ్, సభా వేదిక ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించారు. బీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు ఉన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు
ఈ నెల 30న సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపకశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లు, వాహనాలను సిద్ధంగా ఉంచాలని, సంబంధిత శాఖల అధికారులు ప్రవేశ పాసులు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి ఆరుగురి చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సీఎం ప్రారంభించే కార్యాలయాలను అందంగా అలంకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.