నిర్మల్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చారిత్రక గొలుసుకట్టు చెరువులను టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయ ఫలితంగా చెరువుల్లో యేడాది పొడువునా పుష్కలంగా నీరుండడంతో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చారిత్రక బంగల్ చెరువు, కంచరోని చెరువుల్లో బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. శ్యాంగఢ్‌ను పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దనున్నారు. దీనిని అభివృద్ధి పనులు పూర్తి చేసి పర్యాటకులను రప్పించేందుకు కసరత్తు జరుగుతున్నది. బాసర నుంచి కదిలి పాపహరేశ్వరాలయం, నిర్మల్‌లోని కోటలు, బురుజులు, చెరువు లు, కొయ్యబొమ్మల కేంద్రం, కడెం ప్రాజెక్టు, కవ్వాల్ అభయారణ్యంతోపాటు కుంటాల, పొచ్చెర జలపాతాలను కలుపుతూ ఈ టూరిజం కారిడార్‌కు రూపకల్పన చేశారు. పర్యాటకులకు ఆతిథ్యం కల్పించేందుకు స్థానికంగా గల పురాతన ఐబీలో రూ.12 కోట్లతో హరిత టూరిజం హోటల్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే ఐబీని తొలగించి మంత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

విశ్వనాథ్‌పేట నుంచి బంగల్పేట్ చెరువు మీదుగా రూ.38 కోట్లతో నూతన కలెక్టరేట్ వరకు ఫోర్‌లేన్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఫోర్‌లేన్‌తోపాటు సెంట్రల్ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫోర్‌లేన్ పూర్తయితే సువిశాలమైన బంగల్ చెరువు టూరిజం స్పాట్‌గా మారనున్నది. బోటింగ్‌తోపాటు ఇక్కడ మినీ థీం పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే కంచరోని చెరువులో కూడా బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా నిధులను మంజూరు చేసేందుకు హామీనిచ్చారు. ఇలా.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో నిర్మల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, సహజ సిద్ధమైన వనరులన్నీ పర్యాటక ప్రదేశాలుగా మారబోతున్నాయి. కాగా.. జిల్లాలో ఇప్పటికే దాదాపు 100 కోట్లను వెచ్చించి 600 పైగా దేవాలయాలను మంత్రి అల్లోల నిర్మింపజేశారు. ఇందులో భాగంగానే టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీనిపై అధికారులతో మంత్రి సంప్రదింపులు జరిపి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రూ.38 కోట్లు మంజూరు
నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్‌పేట నుంచి బంగల్పేట్ చెరువు మీదుగా ఇటీవలే నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఎస్డీఎఫ్ నిధులు రూ.38 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 460 జారీ చేసింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ మీదుగా ఖానాపూర్, కడెం ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రోడ్డు అనుకూలంగా మారనుంది. నిర్మల్ పట్టణంలోకి రాకుండానే ఈ ఫోర్‌లేన్ ద్వారా నేరుగా 61వ నంబర్ హైవే పైకి చేరుకోవచ్చు. అలాగే ఖానాపూర్, మామడ ప్రాంతాల ప్రజలు ఆదిలాబాద్ వైపు వెళ్లాలంటే కలెక్టరేట్ రోడ్డు నుంచి నేరుగా విశ్వనాథ్పేట్కు చేరుకోవచ్చు. దీంతో నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ భారం తగ్గనుంది. బంగల్ చెరువు పక్క నుంచే ఈ రోడ్డు వెళ్తుండడంతో పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు బంగల్ చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయనుండడం, మరోవైపు రోడ్డును విస్తరించడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నిర్మల్ కేంద్ర బిందువుగా మారింది..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రకృతి సోయగాలను తిలకించేందుకు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పర్యాటకులు, భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలతోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది. దీంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులతోపాటు, పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి నిర్మల్ జిల్లాకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడికి సమీపంలోని కవ్వాల్ అభయారణ్యం, కడెం ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చెర జలపాతాలను చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఆయా పర్యాటక ప్రాంతాలన్నింటికి నిర్మల్ కేంద్రబిందువుగా మారింది. నిర్మల్ పట్టణంలో చారిత్రక చెరువులతోపాటు కోటలు, బురుజులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి పర్యాటకులు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణంలోని రెండు పెద్ద చెరువుల్లో బోటింగ్ ఏర్పాటు చేసి చెరువు గట్టు వద్ద పార్కులను అభివృద్ధి చేస్తాం. సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే పర్యాటకులు, భక్తుల కోసం నిర్మల్‌లో రూ. 12 కోట్ల వ్యయంతో ఇటీవలే అధునాతనంగా హరిత హోటల్స్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించాం.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి