సోన్, జూన్ 12 : తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడిచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ మేలు చేశాయని, మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ ఆశీర్వదించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. దివ్యాంగులకు పింఛన్ రూ.వెయ్యి పెంచడాన్ని హర్షిస్తూ నిర్మల్ పట్టణంలోని కడ్తాల్ వై జంక్షన్ సాగర్ కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞతసభలో మంత్రి దివ్యాంగుల సంక్షేమానికి, ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ రాకముందు దివ్యాంగులకు రూ.500 ఉన్న పెన్షన్‌ను తొమ్మిదేళ్లలో రూ.4,016కు పెంచడం సామాన్య విషయం కాదన్నారు.
వైకల్యంతో, నిస్సహాయతో ఉన్న దివ్యాంగులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం మేమున్నామంటూ భరోసా కల్పించిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ మరిచిపోవద్దన్నారు. తెలంగాణ రాకముందు రూ.500 ఉన్న పెన్షన్‌ను 2014లో రూ.1500కు పెంచారని, 2018లో దాన్ని రెట్టింపుచేసి రూ.3,016కు, మొన్న మంచిర్యాల సభలో రూ. వెయ్యి పెంచుతూ రూ.4,016 ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో 40వేల మంది దివ్యాంగులు ప్రయోజనం పొందనున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ల్యాప్‌టాప్‌లు, దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే నగదు ప్రోత్సాహకం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వడంతో రాష్ట్రంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో ఎందరో మంది దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారంటే అది ప్రభుత్వం ఇచ్చిన సహకారమేనన్నారు.
అదే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దివ్యాంగుల పెన్షన్ రూ.600కు మించి లేదని పేర్కొన్నారు. త్వరలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూం ఇండ్లలో ప్రాధాన్యమిస్తామని, నిర్మల్ జిల్లాలో సంక్షేమ భవనానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో దివ్యాంగులకు మూడుశాతం రిజర్వేషన్ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒకశాతం పెంచి నాలుగుశాతం అమలు చేస్తున్నారని తెలిపారు. డీఆర్డీఏ దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి సదరం క్యాంపులు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేశామని, ప్రత్యేక అవసరాలున్నవారిని గుర్తించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీడీ గోవింద్రావు, ఓస ప్రసాద్, జిల్లా అధికారులు రాజేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌రావు, శోభ, సీడీపీవో నాగమణి, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు సట్టి సాయన్న, ఇసాక్, సురేందర్, రియాజ్, ఇస్మాయిల్, గంగామణి, జ్యోతి, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.