రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సర్కారు ఉంటే, కేంద్రంలో మాత్రం సంక్షోభంలోకి నెట్టేసే ప్రభుత్వం పాలననందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేయడం, కుట్రలకు తెరలేపడం లాంటివే పాలనగా భావిస్తున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వీటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాగా, ఇదే విధంగా నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం మాలేగావ్, ఖానాపూర్ మండలం తర్లపాడు, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండల కేంద్రాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆయా చోట్ల జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ హ్యాట్రిక్ గెలుపునకు కృషి చేద్దామని, కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
-నిర్మల్ టౌన్/కుభీర్/ఖానాపూర్‌రూరల్/బజార్హత్నూర్, ఏప్రిల్ 7
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్, దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న బీజేపీపై బేరీజు వేసుకొని ఏది కావాల్నో నిర్ణయించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం సమీపంలో ఉన్న మైదానంలో పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము అధ్యక్షతన పది వార్డుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై తెలంగాణ..జై జై కేసీఆర్, జై ఐకేఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందాక, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ సత్తా చాటేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఇంటింటికీ చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందని, కార్యకర్తలకు రూ. 2 లక్షల బీమా అందిస్తున్నట్లు గుర్తు చేశారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం నిధుల్లో కోత విధిస్తున్నదని మండిపడ్డారు. 24 గంటల కరంట్, దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు, మహిళలకు ఆరోగ్య పరీక్షా కేంద్రాలు, కంటి వెలుగు, వంటి పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ఇలాంటి పథకాలు ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని బీజేపీ నాయకుల తీరుపై మండి పడ్డారు. చివరకు పేపరులీకులతో సంబంధం ఉన్న బీజేపీ నాయకుల బండారం బయటపడిందని, దీనికి ఆపార్టీ జిల్లా నాయకులు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు.
నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని స్పష్టం చేశారు. రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1200కు పెంచిన ఘనత కేంద్రంలోని ఆ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. నిర్మల్‌లో త్వరలోనే మెడికల్, నర్సింగ్ కళాశాలలు నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం, సచివాలయం త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
విద్యార్థులతో చెలగాటమా : గంగాధర్ గౌడ్, జిల్లా ఇన్చార్జి
బీజేపీ నేతలు పేపర్లను లీకు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి గంగాధర్‌గౌడ్ మండిపడ్డారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వారే ఇలా కుట్రలు చేసి, పిల్లలను ఇబ్బందులకు గురు చేయడం తగునా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అనంతరం మంత్రి స్వయంగా కార్యకర్తలకు భోజనం వడ్డించారు. మంత్రిని పలువురు బీఆర్ఎస్ నేతలు గజమాలతో సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, రాజు, గంగారెడ్డి, నేరేళ్ల వేణు, అప్పాల వంశీ, అమెడ దేవేందర్, లక్ష్మీనారాయణ, నరహరి, గంగాధర్, నవీన్‌కుమార్, రామకృష్ణ, మేడారపు అపర్ణాప్రదీప్, ఆకుల లక్ష్మి, పద్మాకర్, నజీర్‌ఖాన్, అప్సర్, డీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులు గౌతంరెడ్డి, దివ్యారెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
నీళ్ల బాధ తీరింది..
నిర్మల్ పట్టణంలో గతంలో వేసవి వచ్చిందంటే నీటి తిప్పలు బాగుండేవి. బిందెనీళ్ల కోసం ఎన్నో అవస్థలు పడేవాళ్లం. ఇప్పుడు మంత్రి అల్లోల సహకారంతో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నీళ్లిస్తున్నరు. ఇందుకోసం ప్రత్యేకంగా నల్లాలు ఏర్పాటు చేసిన్రు. బేస్త్తవార్పేట్, ఇసురాళ్లగుట్ట, తదితర ప్రాంతాల్లో నిత్యం రెండుపూటలా నీరు సరఫరా చేస్తున్నరు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషితోనే ఇదంతా సాధ్యమైంది.
-ఉమాదేవి పద్మాకర్
మహిళలకు ఆత్మగౌరవం పెరిగింది..
బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళల పేరిట మంజూరు చేయడంతో ఆత్మగౌరవం పెరిగింది. పింఛన్లు, రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూం ఇండ్లు, తదితర పథకాలన్నీ మహిళలకే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతున్నారంటే అందుకు సీఎం కేసీఆరే కారణం. జిల్లాతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదంటే మంత్రి అల్లోల కృషి ఎంతో ఉంది.
-మేడారపు అపర్ణ, కౌన్సిలర్, నిర్మల్