జైపూర్, నవంబర్ 18 : పర్యావరణహిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ.. మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్బన్డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ వాయువును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రంలో బొగ్గు మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కిలోల పరిమాణం గల కార్బన్డయాక్పైడ్ను సేకరించి మిథనాల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయనున్నది. ఈ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కాగా, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. ప్రయోగం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కార్బన్ ఉధారాలను 99.9 శాతం వరకు వాతావరణంలో కలువకుండా నివారించడంకోసం ఈఎస్పీ (ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్) నెలకొల్పడం జరిగిందన్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ఈ ప్రయోగాత్మకప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటికే సివిల్ నిర్మాణాల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లు పూర్తయినట్లు పేర్కొన్నారు.
వ్యాపార ప్రయోజనాలు
ప్లాంట్ ప్రారంభం తర్వాత ప్రతి రోజూ 180 కేజీల మిథనాల్‌ను తయారీ చేస్తారు. మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్ర్తాల తయారీలో వినియోగించనున్నారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మిథనాల్‌ను వివిధ పరిశ్రమలకు అమ్ముకొని లాభాలు గడించవచ్చని యాజమాన్యం యోచిస్తుంది. ఈ మేరకు ఎస్టీపీపీ వేధికగా అధికారులు ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇది విజయవంతమైతే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్, మిథనాల్ ఉత్పత్తితో లాభాలు గడించే అవకాశం ఉంది.