మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో మెడికల్ కళాశాల శాశ్వత భవనాలతో పాటు వాటికి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్మించాలని యంత్రాంగం నిర్ణయించగా, ఇందుకోసం 14.13 ఎకరాలు ఇచ్చేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 500 కోట్లతో కాలేజీతో పాటు హాస్పిటల్ ఏర్పాటు చేయనుండగా, మొదట రూ.140 కోట్లతో పనులు ప్రారంభించేందుకు సంబంధిత శాఖ సన్నద్ధమవు తున్నది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల ప్రతినిధి, జనవరి 23 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/మంచిర్యాల ఏసీసీ, జనవరి 23 : వ్యవసాయం మార్కెట్ గిడ్డంగుల్లోని రేకుల షెడ్డులోనే మెడికల్ కాలేజీ పెట్టారు.. అందుకనే ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) అనుమతులు నిరారించింది.. అయినా కేంద్రంతో కొట్లాడి పర్మీషన్ ఇస్తే మంచి భవనం, అద్భుతమైన క్యాంపస్ నిర్మించుకుంటామని చెప్పి మరీ.. మెడికల్ కాలేజీని సాధించుకున్నాం. రెండు నెలల కిందటే అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఎంతోమంది పేద పిల్లలకు ఇక్కడ సీట్లు వచ్చాయి. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పిల్లలే ఆరుగురు ఉన్నారు. ఇక వైద్య విద్యకు ఢోకా లేదనే సంబురంలో ఉండగానే.. మెడికల్ కాలేజీ విషయంలో మరో తీపి కబురు అందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో కాలేజీకి శాశ్వత భవనంతో పాటు దానికి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ దవాఖాన నిర్మాణానికి 14.13 ఎకరాల స్థల కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనిపై వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ వ్యయం రూ.500 కోట్లు..
మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్లు కూడా అయ్యాయి. రూ.500 కోట్లతో కాలేజీ సహా దవాఖాన నిర్మించనున్నారు. ఇన్షియల్ స్టేజ్‌లో రూ.140 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సాయికుంటతో పాటు పాత మంచిర్యాలలోని ఓ లే అవుట్ స్థలం, ఇందారం పరిసరాల్లోని స్థలాలను మెడికల్ కాలేజీ కోసం పరిశీలించారు. డీఎంఈ (డైరెక్టర్ మెడికల్ హెల్త్) రమేశ్‌రెడ్డి నేరుగా జిల్లాకు వచ్చి ప్రతిపాదిత స్థలాలను చూశారు. జిల్లాకేంద్రంలో హైవేకు 800 మీటర్ల దూరంలో ఉండడం పైగా బెల్లంపల్లి, చెన్నూరు రెండింటికి ఇది దగ్గర కావడంతో సాయికుంటలోనే కాలేజీని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. గోదావరి వరదల్లో ముగినిపోయే ప్రమాదం ఉందా.. లేదా అనే అంశాన్ని సైతం ఆరా తీశారు. మొన్న వచ్చిన వరదలకు ఈ స్థలం ఏ మాత్రం ఎఫెక్ట్ కాలేదు. పక్కనున్న ఇండ్ల వరకు మాత్రమే నీరు వచ్చింది. ఇక్కడికి వచ్చే రోడ్డు సైతం వరదల్లో మునగలేదు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే మెడికల్ కాలేజీ ఇక్కడే నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు.
నేడు ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఎదులాపురం, జనవరి 23 : ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మంగళవారం హాజరవ్వాలని డీఈవో ప్రణీత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కోసం అర్హత కలిగిన స్కూల్ అసిసెంట్లు, తత్సమాన ఉపాధ్యాయులు సాయంత్రం 5 గంటలల్లోగా రావాలని పేర్కొన్నారు. నిజ ధ్రువీకరణ పత్రాలను వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.