ఆదిలాబాద్ : పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) తెలిపారు. జొన్న ( Sorghum ) కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైనథ్, బేల, ఆదిలాబాద్ మార్కెట్ యార్డులలో జొన్న పంట కొనుగోళ్లను మాజీ మంత్రి శుక్రవారం పరిశీలించారు.
మార్కెట్ యార్డ్లో రైతులు రోజుల తరబడి లోపల ఉండాల్సి వస్తుందని , కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను కాంటా చేస్తున్న రైతులకు పట్టీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులలో రైతుల పంట తడిసిపోయి నష్ట పోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.
లారీలు, హమాలీలు, గోదాముల కొరత కారణంగా పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు. జిల్లాలో జొన్న కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవనున్నట్లు వెల్లడించారు.