పొదుపుగా వాడుకుంటేనే జీవనం
నేడు ప్రపంచ నీటి దినోత్సవం
సాగు, తాగు నీటి సంరక్షణకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి
ఉమ్మడి జిల్లాలో భారీగా పెరిగిన భూగర్భజలాలు
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, మార్చి 21 : సమస్త ప్రాణకోటికి జలమే జవనాధారం. గాలి తర్వాత అత్యవసరమైన నీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ‘మిషన్ కాకతీయ’ తీసుకొచ్చి చెరువులను మరమ్మతులు చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతల వంటివి నిర్మించింది. హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటగా, అత్యధిక వర్షపాతం నమోదై భూగర్భ జలాల వృద్ధి గణనీయంగా పెరిగింది. ‘మిషన్ భగీరథ’తో తాగునీటి కష్టాలను తీర్చింది. నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలం ఆవశ్యకత, సంరక్షణపై ప్రత్యేక కథనం..
జలం జీవకోటికి ప్రాణాధారం. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నీటి లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. మానవుని నిర్లక్ష్యం, నీటి పొదుపు పద్ధతులు పాటించకపోవడం, నీటి వనరులను పెంచుకోకపోవడంతో మనుగడే ప్రశ్నార్థకమవుతున్నది. నీళ్లు దోచుకుంటున్నారనే సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించారు. నీటి విలువ తెలిసిన అపరభగీరథుడు ఆయన. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథవంటి పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో నీటి కొరతలేకుండా విశేష కృషి చేస్తున్నారు. నీటిని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు అందించేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
2025 నాటికి..
తాగునీటి సమస్య ప్రస్తుతం ఎన్నో దేశాలను పట్టి పీడిస్తున్నది. 2025 సంవత్సరం నాటికి దాదాపు 50 దేశాల్లో నీటి కొరత తీవ్ర రూపం దాలుస్తుందని ఐక్యరాజ్యసమితి గతంలోనే హెచ్చరించింది. సమీప భవిష్యత్తులో మన దేశం కూ డా ఉండడం దురదృష్టకరం. 1992లో బ్రెజిల్‌లోని రియోడిజి నీరియాలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ అభివృద్ధి సంస్థ సదస్సులో నీటి సమస్యను గుర్తించారు. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా నిర్వహించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగించాలని నిర్ణయించారు.2022లో ‘అదృశ్యమైన జలాలనుదృశ్యమానం చేద్దాం’ అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
నీరే ప్రాణాధారం..
భూగోళంపై మనుగడ సాధిస్తున్న కోట్లాది ప్రాణులకు నీరే కీలకం. మన పూర్వీకులు నీటి వనరులున్న చోటే జనావాసాలు ఏర్పరచుకొని అభివృద్ధి చెందారు. జీవితంలో చేసే ప్రతి పనీ నీటి చుక్కలపైనే ఆధారపడి ఉంది. సకల జీవులకు అవసరమైన నీటిని విచ్చలవిడిగా వినియోగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నీటి సమస్యకు కారణమవుతున్నారు. మానవ తప్పిదాలతో అనేక ప్రాణులు కనుమరుగవుతున్నాయి.
నీటిని ఇలా పొదుపు చేయవచ్చు..
కాలకృత్యాలకు అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. కుళాయిలు ఉపయోగించిన వెంటనే నిలుపుదల చేయాలి. బట్టలు ఉతికే సమయంలో నల్లాను ఆపి నీటి వృథాను అరికట్టాలి. నీటి లీకేజీని వెంటనే అరికట్టాలి. నీటి కాలుష్యాన్ని నివారించాలి. ఇంకుడు గుంతలు నిర్మించి వాన నీటిని పొదుపు చేయాలి. చెరువులో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలి. కనీసం 3 నుంచి 5 మీ.లోతు ఇసుక నిల్వలు ఉండాలని చెప్పే ‘వాల్టా’ను అతిక్రమించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు విధించాలి.
సంరక్షణ పద్ధతులు..
చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు విరివిగా నిర్మించాలి. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను నదులు, వాగుల్లో కలువకుండా చర్యలు తీసుకోవాలి. కర్మాగారాల్లో వెలువడే కలుషిత నీటిని ఈటీపీ (ఎఫ్లూఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) ద్వారా శుభ్రం చేసి తిరిగి వాడుకునేలా చేయాలి. నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974ను కచ్చితంగా అమలు చేయాలి. సీఆర్ఈపీ (కార్పొరేట్ రెస్పాన్స్‌బిలిటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్) సంరక్షణ పద్ధతులు చేయాలి. రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాల్సిన అవసరముంది.
జల సంరక్షణకు రాష్ట్ర సర్కారు కృషి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో నీటి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన అపరభగీరథుడు ఆయన. నీ టిని ఒడిసి పట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సా గు, తాగు నీటికి ఢోకా లేకుండా అహరహం కృషి చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చిన మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా నీటి కష్టాలను దూరం చేసింది. అదే విధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చిన్న నీటివనరులపై చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణంవంటి పనులు చేపట్టడం వల్ల భూగర్భజలాల వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. ఏడు విడతల్లో చేపట్టిన హరితహారంలొ 15 కోట్ల మొక్కలు నాటగా, వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
నికరమైన భూగర్భజలాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ ఉద్యమం భూగర్భ జలాల పెంపునకు దోహదపడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూగర్భజల శాఖలు ఉన్నాయి. 95 డిజిటల్ వాటర్ మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను లెక్కిస్తున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాల లెక్కింపు కార్యక్రమాన్ని విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,72,147హెక్టా మీటర్ల భూగర్భజలాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందులో 61,018 హెక్టా మీటర్లు వివిధ అవసరాల కోసం వినియోగిస్తుండగా, 1,11,129 హెక్టా మీటర్లు మిగులు జలాలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో సరాసరిగా ఉన్న భూగర్భ జలాల్లో కేవలం 35 శాతం మాత్రమే నీటిని వినియోగిస్తుండగా 65 శాతం మిగులు జలాలుగా ఉన్నాయి. వీటిని పొదుపుగా వినియోగించుకుంటే మరో మూడేళ్ల వరకు నీటి కొరత ఉండదు.
మన నీరు మన బాధ్యత
భవిష్యత్తరాలకు నీరందించాలంటే వనరులు పెంచుకోవడం, పొదుపు చేయడం తప్పనిసరి. సహజవనరైన నీటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే ఒక నీటి చుక్కను ఉత్పత్తి చేసినట్లే అవుతుంది. సకల ప్రాణుల కోసం అత్యవసరమైన నీటి సంరక్షణ, పొదుపును ఈ రోజునుంచైనా ప్రారంభిద్ధాం. – గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త, రాష్ట్ర పర్యావరణ విద్యా శిక్షకులు, మంచిర్యాల
పెరిగిన జలవనరులు
జీవరాశులకు జలమే జీవనా ధారం. ఆ జలాన్ని సంరక్షిం చుకోవాల్సిన బాధ్యత ప్రజ లదే. భూగర్భ జల పరిరక్ష ణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణం గానే ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో 50 శాతం మాత్రమే నీటిని వినియోగి స్తున్నాం. భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జలసంరక్షణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తు న్నాయి. ఈసారి వరిసాగు తగ్గడంతో భూగర్భ జలాల వృద్ధి కనిపిస్తోంది. ప్రజలు బాధ్యతగా నీటిని పొదుపు చేసుకోవాలి. – శ్రీనివాస్‌బాబు,నిర్మల్ జిల్లా భూగర్భ జలశాఖ అధికారి