స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో విఫలమవడం.. రైతులు, మహిళలు, యువత ఇలా ఏ వర్గం చూసిన అసమ్మతితో ఉండడం.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని గ్రహిస్తున్న లీడర్లు అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. గల్లీ నుంచి నియోజకవర్గస్థాయి వరకు నాయకులు ప్రతిపక్ష పార్టీలోకి క్యూ కడుతున్నారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా కారు ఎక్కుతున్నారు. ‘సారే కావాలంటున్నరే.. మళ్ల కారే కావాలంటున్నరే..’ అంటూ గ్రామాల్లో వినిపిస్తున్న బతుకమ్మ పాటలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతపృత్తి ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరిగేలా చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్న నాయకులు కాంగ్రెస్, బీజేపీలను వీడి మరీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా పార్టీలోకి వలసలు పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారీగా చేరుతున్న నాయకులతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది.
– మంచిర్యాల, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వర్గపోరు, ఎమ్మెల్యే తీరుతో విసిగిపోతున్న లీడర్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్-బీజేపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల తీరుతో క్షేత్రస్థాయి నాయకులు విసిగిపోతున్నారు. పైగా ఆయా పార్టీల్లోని వర్గపోరు కష్టపడుతున్న వారికి ఇబ్బందిగా మారింది. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నాయకులే మండిపడుతున్న దుస్థితి నెలకొన్నది. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అన్నది ప్రధాన సమస్యగా మారింది.
దీనికి తోడు ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని కొందరు నాయకులు చేస్తున్న ఆగడాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో ప్రైవేటు వ్యక్తుల భూములు కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడం.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో జనాల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ రకమైన నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపం ప్రధాన సమస్యగా మారింది.
బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ స్థానికంగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న నాయకులు, అదే పార్టీలోని కీలక నాయకులకు మధ్య వర్గపోరు నడుస్తున్నది. పార్టీలో పట్టుకోసం ఎవరికీ వారు ప్రయత్నిస్తుండడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యేల పట్టింపు లేకపోవడం, అభివృద్ధి అంతంత మాత్రంగా సాగుతుండడం, ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో గ్రామ, మండల స్థాయి నాయకులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
బాకీ కార్డు చూపించి నిలదీసేందుకు సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులను తీసుకొస్తున్నది. నియోజకవర్గాల్లో బాకీ కార్డులు చూపించి నిలదీసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు జనం సిద్ధం అవుతున్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500, వృద్ధులకు ఇస్తామన్న రూ.4వేల పింఛన్, వికలాంగులకు ఇస్తామన్న రూ.6వేల పింఛన్, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ తులం బంగారంపై ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను నిలదీసి ప్రశ్నించేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు బీఆర్ఎస్ బాకీ కార్డు తోడవడంతో అధికార పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈలోగా తమ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడం వారికి సవాల్‌గా మారింది. అధికార పార్టీ అని చూసుకుంటే తమ రాజకీయ జీవితం ఆగమయ్యే పరిస్థితి వచ్చిందంటూ పలువురు అధికార పార్టీ నాయకులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము పార్టీ మారడం మంచిదనే భావనతో చాలా మంది ఉన్నట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలోకి రానున్న రోజుల్లో మరిన్ని వలసలు పెరిగే అవకాశాలు ఉండడం కాంగ్రెస్, బీజేపీలను కలవరపెడుతున్నది.
గెలుపే లక్ష్యంగా పని చేయాలి..
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికల్ పేట్, అక్టోబర్ 6: రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. పెంచికల్పేట్లో సోమవారం బీఆర్ఎస్ ప్రధాన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్గాం గ్రామానికి చెందిన పుల్లయ్య, వెంకటి, అన్నాజీ బీఆర్ఎస్లో చేరగా వారికి కోనేరు కోనప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు జాజిమొగ్గ శ్రీనివాస్, సంజీవ్, రాజన్న, సుధాకర్ నాయకులు తిరుపతి, సాజిత్, వెంకన్న, రామన్న పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు జరిగిన వలసల్లో కొన్ని ముఖ్యమైనవి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. కోస్గి గ్రామంలో సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కౌటాల మండలంలోని తాటినగర్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు భారీ సంఖ్యలో చేరారు.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మాజీ జడ్పీ టీసీ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రె స్, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నార్నూర్ మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యశ్వంత్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మాజీ యూత్ నాయకుడు బొడ్డు రాజ్‌కుమార్, వాంకిడి మండలంలోని జముందరి గ్రామ మాజీ ఉప సర్పంచి బండారి దివాకర్, చౌపాన్గూడ బీజేపీ మాజీ ఉప సర్పంచి లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన పలువురు కీలక స్థానిక నాయకులు ఇప్పటికే పార్టీలో చేరారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, మరికొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ, ఎమ్మెల్యేలపై మండిపడుతున్న కొందరు సీనియర్ లీడర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో సిరికొండ మండలంలోని చిమన్గుడి, ఫకీర్ నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది నాయకులు బీఆర్ఎస్లో చేరగా, సిరికొండ మండంలోనూ పలువురు అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎమ్మెల్యే ఎక్కడ ప్రొగామ్ పెట్టుకున్నా అక్కడ పార్టీలో చేరికలు ఉంటున్నాయి. నేరడిగొండకు చెందిన అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేశారు. మొన్నటికి మొన్న తాంసి మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పొతగంటి నగేశ్‌రెడ్డి, సయ్యద్ నయీం, అంజద్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.