నిర్మల్ అర్బన్, డిసెంబర్ 5 : ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ. వారి బాధ్యతను మరిచి వేలల్లో జీతాలు తీసుకుంటూ.. వారి హోదాను మరిచి ప్రజలను లంచం పేరిట పీడిస్తున్నారు. ఏ శాఖలో అయినా పని జరగాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో కొంత మంది అధికారులు ప్రతి పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో పని మూడు, ఐదు, ఏడు, 15 రోజుల్లో పూర్తి చేయాలి. కానీ.. కొన్ని శాఖల్లో నిబంధనలు పక్కనబెట్టి ప్రతి పనికి పైసలు డిమాండ్ చేస్తున్నారు.
చేయాల్సిన పనులకు అధికారులు చేతులు చాపడంతో ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తున్నది. లంచం అడిగితే అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు లంచావతారులను పట్టించింది యువకులు కావడం విశేషం. యువత తలచుకుంటే అవినీతి అధికారుల భరతం పట్టొచ్చని ఇటీవల జరిగిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. కాగా.. కొన్ని కేసుల్లో పెద్ద మనుషులు కూడా ఏసీబీ అధికారులను ఆశ్రయించడం ప్రజల్లో చైతన్యం వెల్లివిరిస్తుందనడానికి నిదర్శనం.
నిర్మల్ పట్టణానికి చెందిన సల్ల హరీశ్ సేత్వారి పట్టా కోసం సర్వే అండ్ ల్యాండ్ కార్యాలయానికి పని నిమిత్తం అధికారులను కలిశాడు. తమ పని కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని తేల్చి చెప్పడంతో రూ.10 వేలకు బేరం కుదిర్చారు. డబ్బులు ఇచ్చి పని చేయించుకునే ఇష్టం లేక పోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. దీంతో రూ.10 లంచం ఇస్తుండగా జూనియర్ అసిస్టెంట్ జగదీశ్, అటెండర్ ప్రశాంత్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
– సల్ల హరీశ్ కుమార్, నిర్మల్.