ఆదిలాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా కేంద్రంలోని రూ.14 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు 18 నెలలుగా నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన సమీకృత మార్కెట్లో కూరగాయలతోపాటు ఇతర అమ్మకాలు సాగించే అవకాశం ఉంది.
దాదాపు 100 మంది వ్యాపారులు అమ్మకాలు సాగించే వీలుగా రెండు అంతస్తుల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకునేలా నిర్మాణాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు మార్కెట్ నిర్మాణం పనులు వేగంగా కొనసాగాయి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి కూరగాయలు, ఇతర వ్యాపారులకు దుకాణాలకు అందుబాటులో తీసుకువచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోగా.. ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
అన్ని వసతులతో నిర్మాణం
పట్టణంలో రైతుబజార్‌తోపాటు పలు చోట్ల కూరగాయల విక్రయాలు జరుగుతాయి. చేపలు, చికెన్, మటన్ విక్రయాలు వివిధ చోట్ల కొనసాగుతాయి. సమీకృత మార్కెట్ నిర్మాణం జరిగితే అన్ని ఒకేచోట విక్రయించే అవకాశం ఉంది. ఇక్కడ వాహనాల పార్కింగ్‌కు సరిపడా స్థలం ఉంది.
రైతుబజార్ ముందు కూరగాయలను కొనుగోలు చేయడానికి భారీగా జనం వస్తుండడంతో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే నిలపడంతో జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ రోడ్డుపై వెళ్లే ద్విచక్ర, ఇతర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణం జరిగితే వ్యాపారులతోపాటు ప్రజలకు ఇబ్బందులు దూరమవుతాయని స్థానికులు అంటున్నారు.