Gold | నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఓ చిన్న హోటల్ నిర్వాహకుడు రవీందర్ (పేరు మార్చాం) దగ్గరికి రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి వచ్చి కౌజు పిట్టలు విక్రయించాడు. మీకు మళ్లీ పిట్టలు కావాలంటే ఫోన్ చేయండని నంబర్ ఇచ్చి వెళ్లాడు. ఓసారి రవీందర్ పిట్టలు కావాలని సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే తెచ్చి ఇచ్చాడు. ఇలా నాలుగైదు సార్లు మాట్లాడాక.. ఓ రోజు ఫోన్ చేసి ‘మా తమ్ముడు బెంగళూరులో జేసీబీ నడుపుతాడు. రోడ్డు పనులు చేస్తుంటే బంగారం దొరికింది. అది ఎక్కడ అమ్మాలో తెలియడం లేదు. మీకు కావాలంటే తీసుకోండి. అగ్గువ ధరకే ఇస్తాం’ అని చెప్పాడు. ‘మీకు అనుమానముంటే వచ్చి బంగారం తీసుకెళ్లి చెక్ చేసుకోండి’ అని చెప్పాడు. ఇలా రవీందర్‌ను ఓ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కదిరికి తీసుకెళ్లాడు. అక్కడ బంగారు నాణేల దండలు చూపించాడు. అందులో నుంచి ఓ చిన్న బిల్ల తీసుకొని పరీక్షించుకోమని చెప్పాడు. ఇంటికి వచ్చి చెక్ చేసుకున్న రవీందర్.. అది ఒరిజినల్ బంగారం అని తెలుసుకున్నాడు. రూ.10 లక్షలు పట్టుకొని బంగారం తీసుకునేందుకు తిరిగి కదిరి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక రవీందర్‌ను కత్తులతో బెదిరించి డబ్బులు లాగేసుకొని, ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి పంపించేశారు. ఇక ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని భావించిన రవీందర్ మిన్నకుండిపోయాడు.
బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ లారీ యాజమానికి సైతం ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాగే పిట్టలు విక్రయించాడు. నంబర్ తీసుకొని నెల రోజుల తర్వాత బంగారం దొరికిందంటూ వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. దానికి సదరు లారీ యాజమాని ఇలాంటివి నాకు అవసరం లేదు. మరోసారి ఫోన్ చేయకండి అని చెప్పి పెట్టేశాడు. అయినా తరచూ వెంట పడుతుండటంతో ఓ స్నేహితుడిని తీసుకొని ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి బంగారం బిల్లలను తెచ్చి బెల్లంపల్లిలో తెలిసిన నగల దుకాణంలో టెస్ట్ చేపించాడు. ఒరిజినల్ అని చెప్పడంతో తన స్నేహితులతో కలిసి రూ.40 లక్షల వరకు పట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్‌కు వెళ్లాడు. అక్కడ డబ్బులు ఇచ్చి బంగారం తెచ్చుకున్నారు. తీరా బెల్లంపల్లికి వచ్చాక వాటిని టెస్ట్ చేపిస్తే అది నకిలీ బంగారం అని తేలింది. ఈ విషయం పోలీసులకు చెబితే ఎంక్వైరీలు, కేసులు అని భయపడి విషయం బయటికి చెప్పలేదు.
.. ఇలా వీరిద్దరే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులు, సాధారణ జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, దొరికిన బంగారం తక్కువ ధరకే ఇస్తామంటూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్నది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి ఐదారు బ్యాచ్‌లు, నెన్నెల మండలం నుంచి తొమ్మిది బ్యాచ్‌లు.. ఒక్కో బ్యాచ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ కేటుగాళ్ల చేతుల్లో పడి మోసపోయినట్లు తెలుస్తున్నది. బెల్లంపల్లిలో ప్రముఖ వ్యాపారులు, నెన్నెల మండల కేంద్రానికి చెందిన పేరున్న వ్యక్తులు సైతం బాధితుల్లో ఉండటం గమనార్హం. ఇలా మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు ఈ కేటుగాళ్ల చేతుల్లో పడి మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని కొందరు.. పోలీసులకు చెబితే కేసులు, ఎంక్వైరీలు.. ఇవన్నీ అవసరమా.. అని మరికొందరు ఏం చేయాలో తెలియక సతమతమైపోతున్నారు.
ఇలా మోసం చేస్తారు…
ముందు మారువేషంలో గ్రామాల్లోకి వచ్చే కేటుగాళ్లు కౌజు పిట్టలు, అడవి కుందేళ్లు, పూరేడు పిట్టలను వేటాడి అమ్ముకునేవారిగా నటిస్తారు. తమ దగ్గర పిట్టలు కొనుగోలు చేసిన వారి నుంచి అవసరముంటే ఫోన్ చేయండంటూ నంబర్ తీసుకుంటారు. ఒక్కసారి మన నంబర్ వారి చేతికి పోయిందా ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేసి పిట్టలు ఉన్నాయి.. తీసుకురమ్మంటారా.. అంటూ పరిచయం పెంచుకుంటారు. ఇలా పలుసార్లు ఫోన్ మాట్లాడాక.. ఏదో ఓ రోజు ఫోన్ చేసి ‘సార్ మా తమ్ముడు జేసీబీ నడుపుతుంటే బంగారం దొరికింది. మీకు కావాలంటే చెప్పండి.. అగ్గువ ధరకే ఇప్పిస్తా.. మాకు ఎక్కడ అమ్మాలో తెలియడం లేదు. అందుకని మీకు చెబుతున్నాం.. అంటూ నమ్మబలుకుతారు. నమ్మకం లేకుంటే మా దగ్గర ఉన్న బంగారం నుంచి కొద్దిగా తీసుకెళ్లి చెక్ చేసుకోండంటూ వీడియో కాల్ చేసి తమదగ్గరున్న బంగారు ముద్దలు, చిన్నిచిన్న బంగారు బిల్లలను చూపిస్తారు.
ఇలా రాయ్‌చూర్, మైసూర్, ఏపీలోని పరిగి, హిందూపూర్, కదిరి ప్రాంతాలు ఒక్కొక్కరికికీ ఒక్కో ఊరు పేరు చెబుతారు. వీడియో కాల్లో బంగారాన్ని చూసి ఆశపడి.. వారు రమ్మన్న చోటుకు వెళ్తే ముందు ఒరిజినల్ బంగారు ముద్దలు, బిల్లలను చూపిస్తారు. అలా చూసిన దాని నుంచి ఏదైనా చిన్న బిల్ల ఒకటి తీసుకెళ్లి చెక్ చేసుకొని రమ్మంటారు. వాటిని చెక్ చేస్తే ఒరిజినల్ అని తేలాక.. డబ్బులు పట్టుకొని బంగారం కోసం వెళ్తే నకిలీ బంగారాన్ని అంటగడుతారు. లేదా మెడ మీద కత్తిపెట్టి తీసుకెళ్లిన డబ్బులను లాక్కుంటారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తారు. ఓ వ్యక్తి వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లి వచ్చి.. తిరిగి వెళ్లే వరకు కేటుగాళ్ల మనషులు ఏదో ఒకరకంగా ఫాలో అవుతూనే ఉంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయంటూ బాధితులు చెబుతున్నారు. ఇప్పటికీ బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో పలువురి దగ్గర కేటుగాళ్ల నుంచి టెస్టింగ్ కోసం తెచ్చుకున్న బంగారు గుండ్లు ఉన్నట్లు తెలుస్తున్నది.
నమ్మి మోసపోవద్దు.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఈ తరహా మోసాలపై ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఠాలు ఇలాంటి మోసాలు చేస్తుంటాయి. మోసపోయిన వారు ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎంక్వైరీలు, కేసులు చేయాల్సి వస్తుందని భయపడొద్దు. ఇలా తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దు. అపరిచితులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– రవికుమార్, బెల్లంపల్లి ఏసీపీ