మంచిర్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’లో ‘మన యూరియా మహారాష్ట్రకు..’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, ఇందుకు జిల్లా వ్యవసాయ అధికారి స్పందిస్తూ.. అదంతా అవాస్తమని చెప్పుకొచ్చారు. సరే సారు చెప్పినట్లు నిజమేననుకున్నా.. మరి అదనంగా వచ్చిన బస్తాలు ఏమైపోయినట్లు అన్నదానిపై స్పష్టత కరువైంది.
‘మన యూరియా మహారాష్ట్రకు..’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కాగా, జిల్లా వ్యవసాయ అధికారి స్పందించారు. “మన యూరియా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్నది అపోహ. అది అవాస్తవం. దీన్ని నివారించడానికి కలెక్టర్ పారుపల్లి సరిహద్దులో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి, గట్టి నిఘా ఉంచారు. చెన్నూర్, కోటపల్లి నుంచి ఎలాంటి యూరియా మహారాష్ట్రకు తరలిపోలేదు” అంటూ చెప్పుకొచ్చారు. కానీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అధికారులు చెబుతున్న మాటలకు.. లెక్కలకు ఏమాత్రం పొంతన లేకుండా పోతున్నది. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన గణాంకాలనే ఓసారి పరిశీలిస్తే.. చెన్నూర్ మండలంలో సాగైన వరి, పత్తి తదితర పంటలకు 2372 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుంది.
కానీ, ఇప్పటికే ఆ మండలానికి 3018.240 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. అవసరమున్న దానికంటే 646.24 మెట్రిక్ టన్నులు అధికంగా ఇచ్చారు. కానీ మహారాష్ట్రకు పోలేదంటున్నా రు.. ఇంత వరకూ బాగానే ఉంది.. మరి ఎక్కువగా ఇచ్చిన యూ రియా ఏమైనట్లు.. రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నట్లు.. అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు. గురువారం కూడా చెన్నూర్ మండలం పొక్కుర్ గ్రామంలో రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. పొక్కుర్ గ్రామ పంచాయతీకి గురువారం 266 బస్తాలు రాగా, దాదాపు 500 నుంచి 600 మంది రైతులు యూరియా కోసం బారులు తీరారు.
మొన్నటి దాకా చెన్నూర్, కోటపల్లి మండల కేంద్రాల్లోనూ రైతులు యూరియా కోసం క్యూలు కట్టారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. చెన్నూర్‌కు ఇవ్వాల్సిన దానికంటే 646 మెట్రిక్ టన్నుల ఎక్కువ ఇచ్చాక కూడా రైతులు ఎందుకు గోస పడుతున్నారు.. అంటే ఇచ్చిన యూరియా రైతులకే చేరిందా.. లేక పక్కదారి పట్టిందా.. అసలు 3018.240 మెట్రిక్ టన్నుల యూరియా ఎంత మంది రైతులకు ఇచ్చారు.. ఎన్ని ఎకరాల విస్తీర్ణానికి ఇచ్చారు.. ఒక్కో ఎకరాకు ఇవ్వాల్సింది ఎంత.. ఇచ్చింది ఎంత.. ఒకవేళ రైతులకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ యూరియా ఇస్తే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది… రైతులకు వాస్తవానికి ఇచ్చిన యూరి యా ఎంత.. రికార్డుల్లో నమోదు చేసింది ఎంత.. యూరియా మహారాష్ట్రకు పోలేదు.. మరి ఏమైపోయింది… ఎక్కడికి పోయింది.. విచారించి నిజానిజాలు వెల్లడించాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
వ్యవసాయ అధికారి తెలిపిన ప్రకారం పారుపల్లి సరిహద్దుల్లో కలెక్టర్ సార్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకని చెక్‌పోస్టు పెట్టారు. కల్టెకర్ కుమార్ దీపక్, సీపీ అంబర్ కిషోర్ ఝా స్వయంగా ఆ చెక్‌పోస్టును ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఆ చెక్‌పోస్టు మాయమైపోయింది. జిల్లాలో యూరియా పంపిణీ ఇంకా అయిపోలేదు. ఇంకా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ యూరియా అక్రమ రవాణాను నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు మాత్రం లేదు. చెక్‌పోస్టు ఎందుకు తీసేశారు.. ఎవరికి ఇబ్బంది అవుతుందని తీసేశారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అసలు ఈ చెక్‌పోస్టు ఏర్పాటు చేసిందే ఆగస్టు 19వ తేదీ.. అదీ కూడా ఆగస్టు 14వ తేదీన మన యూరియా మహారాష్ట్రకు తరలిపోతుండగా, ఓ వాహనం పట్టుబడినందుకు ఏర్పాటు చేశారు. అప్పటి దాకా ఈ చెక్‌పోస్టు కూడా లేదు. చెన్నూర్ మండలానికి ఏప్రిల్ నెలలో 281.7 మెట్రిక్ టన్నులు, మేలో 151.515 మెట్రిక్ టన్నులు, జూన్‌లో 807.705 మెట్రిక్ టన్నులు, జూ లైలో1295.685 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు. అంటే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి నెల ముందే చెన్నూర్ మండలానికి 2536.605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. ఆగస్టులో 19వ తేదీన ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు ఈ నిల్వలు పొరుగు రాష్ర్టానికి తరలిపోకుండా ఎలా అడ్డుకున్నది. అసలు పట్టుకున్నది ఒక్క వాహనమే.. అలా ఎన్ని వాహనాలు సరిహద్దు దాటి ఉంటాయి. దాటలేదు అనడానికి గ్యారంటీ ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
యూరియా మహారాష్ట్రకు తరలి పోయిందా.. లేదా.. అన్నది పక్కన పెడితే. చెన్నూర్‌తో పాటు భీమారం, బెల్లంపల్లి, మంచిర్యాల, తాండూర్, లక్షెట్టిపేట మండలాలకు అవసరానికి మించి యూరియా ఎందుకు సరఫరా చేశారు. అధికారులు చెబుతున్నట్లు ఒకవేళ రైతులు అవసరానికి మించి యూరియా తీసుకెళ్లి దాచుకున్నారనుకుంటే.. అలా అవసరానికి మించి యూరియా ఎందుకు ఇచ్చారు అన్నది అంతుబట్టడం లేదు. చెన్నూర్‌తో పాటు యూరియా అవసరానికి మించి సరఫరా చేసిన మండలాల్లో యూరియా ఏమైపోయింది.
రైతులకు చేరింది ఎంత.. రికార్డుల్లోకి ఎక్కింది ఎంత అన్న స్పష్టత రావాల్సి ఉంది. మన యూరియా మహారాష్ట్రలకు తరలిపోలేదు.. అని చెబుతున్న అధికారులు ఇప్పటి వరకు వచ్చిన యూరియా ఎంత.. ఎంత మంది రైతులకు ఇచ్చారు.. ఎంత యూరియా ఇచ్చారు.. నిజంగా రైతులకే ఇచ్చారా.. లేకపోతే నెన్నెల మండలంలో మాదిరి ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో నమోదు చేసి పక్కదారి పట్టించారా.. అన్న అంశాలపై విచారణ చేయాల్సి ఉంది. ఈ విషయమైన జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారిని సురేఖను ‘నమస్తే తెలంగాణ’ఫోన్లో సంప్రదించగా కలెక్టర్‌తో మీటింగ్ ఉందని, ఇప్పుడు మాట్లాడలేనని చెప్పారు.