మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 9 : మంచిర్యాల మున్సిపల్ చైర్మన్‌గా రావుల ఉప్పలయ్య, వైస్‌చైర్మన్‌గా సల్ల మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో మంచిర్యాల ఆర్డీవో, అధీకృత అధికారి వాడాల రాములు ఆధ్వర్యంలో నూతన చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లుండగా, కోరం కోసం 18 మంది కౌన్సిలర్లు హాజరు తప్పనిసరి కాగా, 26 మంది సభ్యులు వచ్చారు. చైర్మన్‌గా రావుల ఉప్పలయ్య పేరును 13వ వార్డు కౌన్సిలర్ నల్ల శంకర్ ప్రతిపాదించగా, మూడోవార్డు కౌన్సిలర్ మాజిద్ బలపరిచారు.
దీనికి కౌన్సిలర్లంతా ఆమోదం పలికారు. వైస్‌చైర్మన్‌గా సల్ల మహేశ్ పేరును 24వ వార్డు కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ ప్రతిపాదించగా, 23వ వార్డు కౌన్సిలర్ బానేశ్ బలపరిచాడు. ఈ నిర్ణయానికి కౌన్సిలర్లందరూ ఆమోదం పలికారు. రెండు పదవులకు ఒక్కొక్కరి పేరునే ప్రతిపాదించడం, మిగతా కౌన్సిలర్లంతా ఆమోదం పలకడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఆర్డీవో రాములు ప్రకటించారు. అనంతరం చైర్మన్ ఉప్పలయ్య, వైస్‌చైర్మన్ సల్ల మహేశ్‌తో ప్రమాణస్వీకారాన్ని చేయించారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత చైర్మన్ చాంబర్‌కు వెళ్లిన చైర్మన్, వైస్చైర్మన్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్చైర్మన్లకు మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.