Road Accident | తాండూర్, సెప్టెంబర్ 17 : ఒక్క యూరియా బస్తా కోసం వెళ్లే క్రమంలో నిండు ప్రాణం పోయింది. యూరియా బస్తాల కోసం మోటార్ బైకుపై వెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదం మహిళ ప్రాణాలను బలిగొన్న సంఘటన తాండూర్ మండలం గోపాల్ రావుపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన ఫీట్ల మారుతి, మృతురాలు పోగుల నానక్క తాండూర్ మండలం రేచిని గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇంటి నుంచి మోటార్ వాహనంపై బయలుదేరారు. అదే క్రమంలో రెబ్బెన మండలం కిష్టాపూర్ నుంచి తాండూర్ ఐబీ వైపు వస్తున్న సెయింట్ థెరీసా స్కూల్ బస్సు మోటారు బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మారుతీ, నానక్క ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మారుతికి కాలు విరిగి తీవ్ర రక్త స్రావం.. కాగా పోగుల నానక్కకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారమందుకున్న తాండూర్ ఎస్ఐ డీ కిరణ్ కుమార్ ఈ సంఘటనా స్థలం వద్దకు చేరుకొని క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నానక్కకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో పెద్దపెళ్లి వద్ద తుదిశ్వాస విడిచింది. వెంటనే కుటుంబీకులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నానక్క భర్త మల్లేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించారు.
భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తుండగా భార్య మృతి చెందడంతో భర్తతోపాటు పిల్లలు మృత దేహం మీద పడి రోదిస్తున్న దృశ్యం అందర్నీ కంటతడి పెట్టించింది.
నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ ఈ పాఠశాల…
తాండూరు మండలంలోని సెయింట్ థెరిస్సా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రెండు నెలల క్రితం విద్యార్థులను పాఠశాలకు తీసుకు వస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి స్కూల్ బస్సు నడుపుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
గతంలో కూడా అయ్యప్ప మాల వేసుకుందని ఓ విద్యార్థినిని యాజమాన్యం పాఠశాలలోకి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టాయి. దీంతోపాటు అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయించినా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా హాస్టల్ నిర్వహించిన ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఇలా ప్రతీ విషయంలోనూ ఈ పాఠశాల వివాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికైనా పాఠశాల యజమాన్యం పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్య పనితీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి నీరజ్ చోప్రా
Ramavaram : ఎస్పీ ఆదేశాలు బేఖాతరు.. బ్లాక్ స్పాట్స్ గుర్తింపులో నిర్లక్ష్యం
Nidamanoor : గౌండ్లగూడెంలో నూతన బోర్ మోటార్ ప్రారంభం