కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ సురేష్ కథనం మేరకు… సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలోని చర్చ్ సమీపంలోని శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆప్ లైన్ పట్టాలు దాటుతుండగా రామగిరి రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. మద్యహ్నం 12 గంటలకు పాత బెల్లంపల్లి ఆండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో మంచిర్యాల నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న రైలు తగిలి గుర్తు తెలియని వృద్ధుడు మరణించాడు.
ట్రాక్‌పై మృతదేహలను గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ రెండు మృత దేహాలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించాం. చనిపోయిన వాళ్లలో ఒకరు పెద్దనపల్లి గ్రామ పంచాయతీ సోమగూడెం పాతబస్తీకి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు మహ్మద్ రాజ్ మహ్మద్ (82)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అండర్ బ్రిడ్జి సమీపంలో మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అతని గురించిన ఎటువంటి ఆధారాలు లేవని, ఆరెంజ్ బ్లాక్ కలర్ ఫుల్ టీషర్టు, బ్లాక్ జీన్ ప్యాంటు ధరించి ఉన్నట్లు, తెల్లటి గడ్డం ఉన్నట్లు వెల్లడించారు. ఆ వృద్దుడి గురించి సమాచారం తెలిసినట్లయితే 8712658601, 9490871784 వాట్సాప్ నెంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.