తాండూర్, జూలై 19: సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్ సూచించారు. శనివారం మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని ఎంవీకే 3 ఇంక్లైన్ గ్రామంలో తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటికీ వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాటిని ఆరికట్టేందుకు ప్రజలను చైతన్య పరచాలన్నారు.
నివాసాల పరిసరాల్లో దోమల పెరుగుదలకు కారణమయ్యే వాటిపై అవగాహన కల్పించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాల పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం తాండూర్ వైద్య బృందం ఇంటింటికి తిరిగి మలేరియా, డెంగితోపాటు సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి, పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు ఝాన్సీ, సూపర్వైజర్ రమాదేవి, దౌలత్, ఎఎన్ఎంలు స్రవంతి, పారిజాత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.