హాజీపూర్, జూలై 12: హాజీపూర్ (Hajipur) మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న ఈ జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ప్రతి అషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వారికోత్సవం నిర్వహించడం అనవయితీగా వస్తున్నది. ఆలయ కమిటీ శనివారం రాత్రి నుంచి భజన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ప్రకృతి ఒడిలో కొలువైన దుర్గమ్మ తల్లి భక్తులకు అమ్మవారిగా దర్శమిస్తూ, భక్తుల మొక్కులను అందుకుంటుంది. భక్తుల కోసం మంచిర్యాల బస్టాండ్ నుంచి జాతర వరకు ఆదివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు.
మంచిర్యాలలోని ఎంసీసీ సిమెంట్ కంపెనీకి సిమెంటు రాయి హాజీపూర్ మండలంలోని గఢ్పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని గుట్టల్లో లభిస్తుంది. సిమెంట్ రాయిని తీసే సమయంలో తరచుగా ప్రమాదాలు జరగడంతోపాటు ప్రాణ నష్టం జరుగుతుండేది. దీన్ని నివారించేందుకు ప్రతి ఏడాది అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిచాలని కంపెనీ యాజమాన్యానికి పూజారులు తెలిపారు. దీంతో అక్కడ ముందుగా మైసమ్మ విగ్రహం, దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయడం మొదలు పెట్టారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే ఆషాఢంలో జాతరను నిర్వహిస్తుంటారు.
ఎంసీసీ క్వారీలో అటవీ శాఖ అధికారులు జంగల్ సఫారీని ఏర్పాటు చేశారు. ఇందులో నీటి కుంటలు, మాంచెలు, వ్యూపాయింట్తో పాటు గడ్డి ప్లాంటలను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు అడవి జంతువులను నేరుగా చూసేందుకు వీలుంటుంది.