కాసిపేట, నవంబర్ 19 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడితండా(ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు. ఈ మేరకు బుధవారం పాఠశాల హెచ్ఎంకు వినతిపత్రం అందించారు. అనంతరం నిరసన వ్యక్తం చేసి పాఠశాలను బంద్ చేయించారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒక ఉపాధ్యాయురాలని కాసిపేటకు డిప్యూటేషన్ పై పంపడం సరైంది కాదన్నారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారని, విద్యార్థుల చదువుల దృష్ట్యా వెంటనే డిప్యూటేషన్ పై పంపిన టీచర్ డిప్యూటేషన్ రద్దు చేసి ఎప్పటిలాగే లంబాడితండాలో నియమించాలని డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ రద్దు చేయాలని, అప్పడి వరకు పాఠశాలకు రామంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా పాఠశాలలో మొత్తం 49 మంది విద్యార్థులు ఉండగా నిబంధనల ప్రకారం ఇద్దరి ఉపాధ్యాయులు అవసరం ఉందని, ఇక్కడ ముగ్గురు ఉన్నారని, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ఇతర పాఠశాలకు ఒక టీచర్ ను డిప్యూటేషన్ ఇచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.