కాసిపేట, ఫిబ్రవరి 1: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, సోమగూడెం జాతీయ రహాదారి మధ్యలోని కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో గల పెద్దనపల్లి వాగును కబ్జాదారులు మాయం చేస్తున్నారు. వాగు కబ్జాకు గురవ్వడం బహిరంగంగా కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో నుంచి వాగుకు అధిక మొత్తంలో వరద ప్రవాహం వస్తుంటుంది. దాంతో వాగు పక్కన మట్టి కట్టలు వేసి పెద్దగా ఉన్న వాగును కాస్త పిల్ల కాలువగా మార్చి.. పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ పెద్ద వాగు ఉంది. నేషనల్ హైవే కూడా కావడంతో నిర్మాణాన్ని విస్తరించి పెద్దగా బ్రిడ్జిని నిర్మించారు. ప్రధాన రహదారి కావడంతో రోడ్డును ఆనుకొని భూముల ధరలు పెరగడంతో కొంత మంది కబ్జాదారులు కన్ను ఈ వాగుపై పడింది. కొద్ది కొద్దిగా వాగు విస్తీరణాన్ని చిన్నగా చేసి వాగు పారే ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్నారు. వాగు పక్కన మొరం పోసి వాగును కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాగు చుట్టు పక్కల మొత్తం ఎత్తుగా మట్టిని నింపి నీరు రాకుండా చేసి.. ఇప్పుడు ఏకంగా వాగును పూర్తిగా మట్టితో నింపుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక ప్రవాహం గల వాగు కావడంతో కబ్జాదారులు ఈ వాగును మూసి వేస్తే రానున్న రోజుల్లో పైన గ్రామాలు నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగును మూసి వేస్తే వరద నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంది. కబ్జాలపై అధికారులు విచారణ చేసి వాగును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ నరేన్ కుమార్ను వివరణ కోరగా ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, ఇంత వరకు దానిపై వివరణ ఇవ్వలేదని తెలిపారు. వాగును పరిశీలించి చర్యలు తీసుకుంటామని, పోలీస్ కేసు నమోదు చేయడమా లేదా ఇతర చర్యలను తీసుకుంటామని ఆయన వెల్లడించారు.