Harish Rao | ఇందిరమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స వికటించి, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాలింతలను హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన జరిగిన పది రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదుగురు బాలింతలు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నార హరీశ్‌రావు తెలిపారు. వీరిలో ముగ్గురు డయాలసిస్‌పై ఉన్నారని పేర్కొన్నారు. తెల్లరక్తకణాలు తగ్గాయి.. కిడ్నీ, లంగ్స్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని చెప్పారు. బాలింతల నుంచి పసిగుడ్డులకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. బాలింతల నుంచి పాలు తగడం వల్ల నీలోఫర్‌లో పసిగుడ్డులు చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలింతలు పూర్తిగా కోలుకోకుండా పసిగుడ్డులను ఎవరు చూసుకుంటారని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఆరుగురికి 10వ తేదీన ఇన్ఫెక్షన్ వచ్చిందని, నలుగురికి 11వ తేదీన సిజేరియన్ చేశారని హరీశ్‌రావు తెలిపారు. థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఇన్ఫెక్షన్ సోకిందని బాధితులు అంటున్నారని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కూడా కారణమని అంటున్నారని అన్నారు. కాలం చెల్లిన మందులు వాడినందుకే ఈ పరిస్థితి వచ్చింటున్నారని తెలిపారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఘటన జరిగిన పది రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. వైద్యారోగ్య అధికారులు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఘటన నుంచి గురించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించలేదని అన్నారు. బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక పేషెంట్ నగలు అమ్మి, అప్పు తెచ్చి వైద్య చికిత్సలు చేయించామని కుటుంబీకులు చెప్పారని హరీశ్‌రావు తెలిపారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఇందిరమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్ హయాంలో గర్భిణులకు న్యూట్రీషన్ కిట్, బాలింతలకు కేసీఆర్ కిట్లు ఇచ్చామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. అమ్మ ఒడి వాహనాల్లో బాలింతలను సురక్షితంగా ఇళ్లకు చేర్చామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు గణనీయంగా తగ్గాయని అన్నారు.