Rohit Sharma | తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత ప్రణాళికల్లో అతని స్థానంపై ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్(,Retirement) వ్యాఖ్యలపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన చివరి వన్డే తర్వాత బీసీసీఐ ఇంటర్వ్యూలో(BCCI interview) కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్‌తో రాణించడం, దేశం తరపున ఆడటం నా పని. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఉన్నంత కాలం అవి కొనసాగుతూనే ఉంటాయని, వాటితో నాకు సంబంధం లేదని చమత్కరించాడు. మైదానంలో నేను ఏం చేస్తానన్నదే ముఖ్యం.
జట్టుకు నా వంతు సహకారం అందించడమే నా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. రూమర్స్ జరగనివ్వండి, అవి లేకపోతే మజా ఉండదన్నారు. నా పని మైదానం లోపల ఉంటుంది, విమర్శించే వారి పని బయట ఉంటుందని స్పష్టం చేశారు. కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న వాళ్లు గానీ, చేతిలో ల్యాప్‌టాప్‌తో రాసేవాళ్లు గానీ నా జీవితం ఎలా సాగుతుందో నిర్ణయించలేరన్నారు.
కాగా, లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడవ వన్డే తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతారన్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇదివరకే కొట్టిపారేశారు. జట్టు ప్రణాళికల్లో రోహిత్ కీలక భాగమని, ఆయన తక్షణ భవిష్యత్తు గురించి ఎటువంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నారన్న మీడియా కథనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడటం విశేషం.