కాసిపేట, జనవరి 4 : గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి అత్యవసర సీపీఆర్(కార్డియోపల్మొనరీ రిసాసిటేషన్) చేశారు స్థానికులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలంలోని సోమగూడేనికి చెందిన హనుమంతు (Hanumanth) కటింగ్ చేసుకునేందుకు వెళ్లాడు. సింగరేణి డిస్పెన్సరీ ముందున్న హేయిర్ కటింగ్ షాప్ వద్ద కొద్దిసేపు కూర్చున్న అతడు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. బీపీ కూడా ఎక్కువై ప్రాణాపాయ స్థితిలో ఉన్న హనుమంతుకు అంబులెన్స్ వచ్చే లోపు స్థానికులు సీపీఆర్ చేశారు.
గుండెపోటుతో కూలబడిన హనుమంతుకు సీపీఆర్ చేయడంతో అతడు కొద్దిగా స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కుక్క రాంచందర్, గాదం శ్రీవాస్తవ్, రామ్ లక్ష్మణ్ గతంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలకు వెళ్లారు. హనుమంతుకు హార్ట్ స్ట్రోక్ రాగానే వారు.. తెలివిగా వ్యవహరించి సీపీఆర్ చేశారు. ప్రాణాలు కాపాడాలనే వారి కృషి ఫలించి.. అతడిలో కదలికలు వచ్చాయి. అనంతరం 108 అంబులెన్స్ రావడంతో వెంటనే హనుమంతును ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసిన రాంచందర్, గాదం శ్రీవాస్తవ్, రామ్ లక్ష్మణ్‌ను పలువురు అభినందించారు.