గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండడానికి కేసీఆర్ సర్కారు న్యూట్రిషన్ కిట్స్‌ను పంపిణీ చేస్తున్నది. మొదటి విడుతగా తొమ్మిది జిల్లాలను ఎంపిక చేయగా.. ఇందులో కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా.. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఐకేరెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో విప్ సుమన్ శ్రీకారం చుట్టారు. రూ.1,962 విలువైన బలవర్ధకమైన పోషకాహారం ఉండగా.. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఒక్కొక్కరికి రెండు సార్లు ఈ కిట్‌ను అందించనున్నది. మొదటి కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయంలో, రెండో కిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేస్తారు.
ఆలోచన బాగుంది..
గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అందించాలనే ఆలోచన మంచిది. ఎంతో మంది న్యూట్రిషన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వమే ప్రత్యేకంగా తయారు చేసిన కిట్‌ను అందించి, రక్తహీనత సమస్యను దూరం చేస్తున్నది. కిట్‌లో ఐదు వస్తువులు కూడా మంచి నాణ్యమైనవి ఉన్నాయి. హార్లిక్స్, ఐరన్ సిరప్, ఖర్జూరం, నెయ్యి, ఆల్బెండజోల్ మాత్రతో పాటు ఒక కప్పుతో బాస్కెట్ ఇచ్చారు. ఇలా గర్భిణుల ఆరోగ్యం మీద ఏ ఒక్క సర్కారూ గతంలో దృష్టి పెట్టలే. సీఎం కేసీఆర్‌తో ఎప్పుడూ పేదల మంచి కోరుతరు.
-రవళిక, ఆసిఫాబాద్
రక్తహీనత నివారణకు ఉపయోగం
గర్భిణుల కోసం అందజేస్తున్న న్యూట్రిషన్ కిట్ గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. కిట్‌లోని వస్తువులన్నీ రక్తహీనత నివారణకు పనిచేస్తాయి. దీంతో బిడ్డతో పాటు మేం కూడా ఆరోగ్యంగా ఉంటాం. గర్భిణులకు శక్తికోసం ప్రోటీన్లను అందించాలని సర్కారు ఈ కిట్‌ను సిద్ధం చేయడం బాగుంది. ఇప్పటికే పిల్లల కోసం కేసీఆర్ కిట్ ఇస్తున్నరు. ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం అభినందనీయం.
-స్వాతి, ఆసిఫాబాద్
తల్లీబిడ్డలను కాపాడుతున్నరు..
ప్రభుత్వం గర్భిణులకు పోషకాహార కిట్ ఇవ్వడం అద్భుతం. పేదల మంచి కోరి సర్కారు ఈ కిట్ ఇస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో మాకు పౌష్టికాహారం ఇస్తున్నరు. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలా తల్లీబిడ్డలను కాపాడేందుకు సర్కారు దృష్టి పెట్టడం మంచి నిర్ణయం. సీఎం కేసీఆర్ అందరినీ కాపాడుతున్నరు. ఆయనను ఏ ఒక్కరూ మర్చిపోరు. ఆయన సల్లంగుండాలె.
-గడ్డం సోనియా, ఆసిఫాబాద్
ఇంత పెద్ద కిట్ ఇస్తరనుకోలే..
పేదల సంక్షేమానికి సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. సర్కారు న్యూట్రిషన్ కిట్ ఇస్తదని మొన్ననే అన్నరు. కానీ ఇంత పెద్ద కిట్ ఇస్తరని అనుకోలే. ఇందులో చాలా వస్తువులు ఉన్నయ్. రక్తహీనత సమస్య పోవడంతో పాటు శక్తి పెరిగేలా ఈ కిట్ సిద్ధం చేసిన్రు. నేను కూడా ఇయ్యాల కిట్టు తీసుకున్న. చాలా బాగుంది. పిల్లలకు మంచి ఆహారం అందాలంటే తల్లులు బలంగా ఉండాలనేది సర్కారు ఉద్దేశం. అందుకే ఇంత మంచి కిట్‌ను తయారు చేయించి ఇస్తున్నది. గతంలో గిట్ల మంచి పనులు చేసిన సర్కారు ఒక్కటీ లేదు.
-రాధిక, ఆసిఫాబాద్
తల్లి ఆరోగ్యమే బిడ్డకు బలం
ప్రభుత్వం ముందుచూపు బాగుంది. ప్రత్యేకంగా మహిళల కోసం ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను తయారు చేసి అందించడం అభినందనీయం.తల్లి ఆరోగ్యమే బిడ్డకు బలం. రక్త హీనత సమస్య పెద్ద ప్రమాదకరం. ఈ సమస్య లేకుంటే సుఖ ప్రసవానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారం అనేది కొంత కష్టం. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి పౌష్టికాహార కిట్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది. నేను కూడా కిట్ తీసుకున్న. చాలా బాగుంది. అన్ని మంచి వస్తువులే ఇందులో ఇచ్చిన్రు. గర్భిణులకు చాలా ఉపయోగపడుతుంది.
– మౌనిక, జన్కాపూర్
ఎంతో ప్రయోజనం
గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయడంతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పట్టణాలు, గ్రామాల్లోని పేదలకు సరైన పౌష్టికాహారం అందకపోవడంతో రక్తం తక్కువగా ఉండడం, హిమోగ్లోబిన్ లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. దీంతో డెలివరీ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం పంపిణీ చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో పోషకాహారం ఉండడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. ఆడబిడ్డలకు అండగా ఉన్న ఏకైక సీఎం కేసీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలతో అందరినీ ఆదుకుంటున్నడు. ఇప్పుడు ఆడబిడ్డల ఆరోగ్యం మీద దృష్టి పెట్టి పుట్టబోయే పిల్లలు బలంగా ఉండేలా చూస్తున్నరు. – అనూష, ఆదిలాబాద్
మేలును మర్చిపోం
ఇంద్రవెల్లి, డిసెంబర్ 22:పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. ఆయన పేరు మీద ఈ కిట్ తీసుకు న్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన దవాఖాన్లల్ల గర్భిణులకు అన్ని సౌలతులు మంచిగ చేసిండ్రు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే దవాఖాన లన్నీ బాగైనయ్. కేసీఆర్ కిట్టు ముందుగాల బిడ్డల కోసం ఇచ్చిన్రు. ఇయ్యాల తల్లుల కోసం ఇస్తున్నరు. తల్లీబిడ్డ మంచిగుండాలని ఈ సర్కారు ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నది. ఇంత కన్నా మంచిగ చేసే లీడరు ఒక్కలన్న ఉన్నరా.. గతంలో ఇలా మంచి చేసిన నాయకుడ్ని చూడలే. సీఎం కేసీఆర్‌తోనే అన్నీ మంచిగైతున్నయ్. అందరి బాధలు తీరుస్తున్నడు. ఆడబిడ్డలకు ఎంతో చేసిండు. ఇంకా చేస్తున్నడు. ఇప్పుడు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టిండు. – సిడాం అంజలి, ఘట్టేపల్లి
తల్లికి పౌష్టికాహారం.. బిడ్డకు బలం
ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎంతో బాగుంది. ఇందులో ఉన్న ఆహార పదార్థాలు, మందులు తీసుకుంటే గర్భిణులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. రెండు సార్లు ఈ కిట్లు పంపిణీ చేయనుండడం సంతోషకరం. వీటితో పేద కుటుంబాలకు ఆర్థికభారం తగ్గుతుంది. బలమైన ఆహారం అందడంతో పాటు రక్తం పెరుగుతుంది. తల్లి పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డకు బలం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నది.
– ఉజ్మాకనం, ఆదిలాబాద్
రక్తహీనత సమస్య ఉండదు
గర్భిణుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారింది. పోషక విలువలతో కూడిన ఆహారం లేకపోవడంతో చాలా మంది గర్భిణులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. నెయ్యి, కర్జూర పండ్లు, హార్లిక్స్ ప్యాకెట్లు, మందులతో కూడిన కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ను ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా అందిస్తున్నది. ఈ కిట్ వల్ల పౌష్టికాహారం అందడంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా పోతాయి. ప్రభుత్వం గర్భిణుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయం.
– భారతి, ఆదిలాబాద్
తల్లికి ఆహారం.. బిడ్డకు ఆరోగ్యం
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 22: నాకు కూడా ఇయ్యాల్నే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చిన్రు. గతంలో ఏ సర్కారు కూడా ఈ విధంగా మహిళలను పట్టించుకోలే. గర్భిణులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అవసరమని వైద్యులు చెప్పిన్రు. మంచి పౌష్టికాహారం కావాలంటే మేం బయట కొనలేం. పేద, మధ్యతరగతి ఆడబిడ్డలను దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీలోనే ఉచితంగా పౌష్టికాహార కిట్లను అందజేయడం సంతోషకరం. ఏది చేసినా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైతది. ఆయన అందరినీ బిడ్డల్లెక్క ఆదుకుంటడు.
-ప్రథమ, ఆదిలాబాద్