దండేపల్లి : ప్రభుత్వ వైఫల్యాలు(Congress failures) ఎండగట్టాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్( Nadelli Diwakar) పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసగించి అధికారం చేపట్టిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సరిగా అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిలదీస్తుంటే అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఆ పార్టీపై పోరాడాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. అందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ లింగన్న, వైస్ చైర్మన్ రవి, తదితరులు ఉన్నారు.