మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీ రోడ్డులో ఉన్న శివశక్తి బేలింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న ప్లాస్టిక్, తుక్కు సామాగ్రి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, గోదావరిఖని నుంచి వచ్చిన నాలుగు ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి కష్టపడి మంటలను ఆర్పి వేశారు. భారీ అగ్ని ప్రమాదంతో గోదాం చుట్టూ ఉన్న దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అగ్నిప్రమాదానికి సంబంధించి తమకు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం అందిందని మంచిర్యాల ఫైర్ స్టేషన్ అధికారి దేవేందర్ తెలిపారు. దీంతో నాలుగు ఫైర్ ఇంజన్లతో దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశామన్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని వెల్లడించారు. సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు. గత నెల 7న ఎంసీసీలోని ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్కేజీఎస్ సంస్థకు సంబంధించిన గోబర్ గ్యాస్‌కు వాడే ప్లాస్టిక్ పైకప్పులు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంనికి గురైన విషయం తెలిసిందే.