కోటపల్లి, సెప్టెంబర్ 24 : రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. పంటలకు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద బుధవారం ఉదయం యూరియా కోసం టోకెన్స్ పంపిణీ చేశారు. టోకెన్స్ కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలిరాగా అదే సమయంలో వర్షం కురిసింది.
భారీ వర్షం కురిసిన లెక్క చేయకుండా రైతులు యూరియా కూపన్ల కోసం లైన్ కట్టి పడిగాపులు కాశారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు చూసి ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దని అనుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల పంటలకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు.